
Bandla Ganesh About Mega Star: కరోనా కల్లోలం అందరినీ అతాలకుతలం చేసింది. ఎంత డబ్బు ఉన్నా కూడా ఎవరిని కాపాడలేకపోయింది. కోట్లు సంపాదించిన వారు కూడా కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోయారు. ఈ మహమ్మారి నుంచి బతికి బట్ట కట్టినవారి కష్టాలు మామూలుగా లేవు.
టాలీవుడ్ నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh) తాను పడ్డ కరోనా కష్టాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తను బతికి ఉన్నానంటే ఆ హీరోనే కారణమని తలుచుకున్నాడు. ఆయన లేకుంటే కరోనాతో చనిపోయేవాడిని అన్నారు.
తాజాగా మాట్లాడిన బండ్ల గణేష్ కరోనా కష్టాలు చెప్పుకొచ్చాడు. నాకు రెండోసారి కరోనా వచ్చిందని.. ఊపిరితిత్తులు (లంగ్స్) 80శాతం దెబ్బతిన్నాయన్నారు. ఏ హాస్పిటల్ కు ఫోన్ చేసినా బెడ్స్ లేవన్నారు.. మా హీరోకు ఫోన్ చేద్దాం అనుకుంటే అప్పుడే పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. ఏం చేయాలో తెలియక చిరంజీవి గారికి ఫోన్ చేశాను. ఒక్క నిమిషం ఆయన ఫోన్ పెట్టేసి నాకు హాస్పిటల్ బెడ్ అరేంజ్ చేశారు. ఒక్కరోజు ఆలస్యం చేసినా నేను చనిపోయేవాడిని అని డాక్టర్లు చెప్పారు. ఈరోజు నేను బతికి ఉన్నానంటే దానికి కారణం చిరంజీవి (Chiranjeevi) గారు అని బండ్ల గణేష్ చాలా ఉద్వేగానికి గురయ్యారు.
ఇక పవన్ కళ్యాణ్ తో తాను సినిమాలు తీసినా తీయకున్నా ఆయన వెంట తిరుగుతానని.. వపన్ తో సినిమా తీయడానికి.. పవన్ పై అభిమానానికి సంబంధం లేదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ చిరంజీవి కుటుంబంలో అందరికీ మద్దతుగా ఉంటానని..వాళ్లంతా మంచోళ్లని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.