
కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బండ్ల గణేష్. తొలినాళ్లలో అందరిలో ఒకడిగా ఉండేవాడు. కానీ.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ తో సినిమా తీసి నిర్మాతగా మారాడో.. ఒక్కసారిగా అతని రేంజ్ మారిపోయింది. తనదైన స్పెషల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. తొలి మూవీ ‘తీన్మార్’ నిరాశ మిగిల్చినా.. మళ్లీ పవన్ తో ‘గబ్బర్ సింగ్’ మూవీ చేసి ఇండస్ట్రీ దద్దరిల్లిపోయే హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత కూడా నిర్మాతగా జోరు కొనసాగించాడు. పవన్ తో సినిమా తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో ‘బాద్షా’ నిర్మించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. అయితే.. ఈ సక్సెస్ ను ఎక్కువగా కాలం కొనసాగించలేకపోయాడు. గడిచిన ఆరేళ్లుగా బండ్ల గణేష్ నుంచి సినిమా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ కాంబోలో తీసిన ‘టెంపర్’ చిత్రం తర్వాత సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు బండ్ల.
అయితే.. టెంపర్ సినిమా నిర్మాణం సమయంలోనే ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ కు మధ్య గొడవ జరిగిందనే టాక్ వచ్చింది. కానీ.. ఎందుకు జరిగింది? కారణమేంటీ? అసలు ఇందులో నిజమెంత? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా.. ఈ విషయమై స్పందించాడు బండ్ల గణేష్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో గొడవ గురించి ఓపెన్ అయ్యాడు.
మెగా ఫ్యామిలీపై తనకున్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు. మెగాస్టార్ తన ప్రాణాలు కాపాడిన దేవుడన్న బండ్ల.. పవన్ తనకు జీవితాన్ని ఇచ్చాడని చెప్పాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ గొడవ గురించి అడగ్గా.. ‘‘గొడవలెందుకు జరుగుతాయి సర్? అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి.’’ అని చెప్పాడు బండ్ల. తద్వారా.. వీళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనని తేలిపోయింది. అయితే.. అదేమీ గొడవ కాదన్నాడు గణేష్. చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇదంతా జరిగిందని, లేకపోతే అంతా హ్యాపీసే అని అన్నాడు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదని, అంతా బాగానే ఉన్నామని చెప్పాడు.
ఇదిలాఉంటే.. నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడిగా కూడా అవతారమెత్తిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ను రీమేక్ చేయబోతున్నాడు బండ్ల. ఇందులో మరో విశేషం ఏమంటే.. ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుందీ చిత్రంలో! గతంలో రెండు, మూడు క్యారెక్టర్లో సినిమాలు వచ్చాయి. కానీ.. ఇది ఏకైక క్యారెక్టర్ తో వచ్చిన సినిమా! ‘ఒత్త సెరుప్పు అళవు7’ అనే టైటిల్ తో ఇచ్చిన ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో బండ్ల తీస్తున్నారు.