Bandla Ganesh: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలను బండ్ల గణేష్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ తో సంబంధం లేకుండా బండ్ల గణేష్ స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాడు. అయితే బండ్ల పోటీ చేస్తోంది.. జనరల్ సెక్రటరీ పదవికి. ఈ పోటీలో తానే గెలవాలని ఏకంగా తన ఇంట్లో పూజలు హోమాలు కూడా చేయిస్తున్నాడు.

“సహస్ర లింగార్చన పూజ నా గృహమునందు ఇప్పుడే పూర్తి చేసుకున్నాను,” అంటూ ఆ పూజను బండ్ల గణేష్ ప్రమోట్ కూడా చేసుకున్నాడు. త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో మిగతా పదవులకు పోటీలో ఉన్న వారిలో ఎవరికీ ఓటు వేసినా ఫర్వాలేదు అని, అయితే జనరల్ సెక్రటరీగా నన్నే గెలిపించండి అంటూ బండ్ల బాబు మిక్కిలీ వేడుకుంటూ వినమ్రంగా విన్నవించుకున్నాడు.
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి.. మధ్యలో అవకాశాలు రాక, మేనేజర్ గా టర్న్ అయి.. అటు నుంచి ఏకంగా నిర్మాత మారి.. గబ్బర్ సింగ్ తో స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అయి.. మొత్తానికి బండ్ల గణేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపెరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, నిజానికి బండ్ల గణేష్ ‘మా’ అధ్యక్ష ఎన్నికలలో మొదట ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇచ్చాడు.
కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నటి జీవిత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోకి చేరింది. దాంతో బండ్ల గణేష్ ఇగో హర్ట్ అయింది. జీవితను ఉద్దేశించి.. ‘నువ్వు ఏమిటి నేను కూడా పోటీ చేస్తా’ అంటూ బండ్ల గణేష్ రంగంలోకి దిగాడు. ఇక అప్పటి నుంచి ఎలాగైనా మా ఎన్నికల్లో గెలిచి, తానేంటో చూపించాలని బండ్ల గణేష్ ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాడు.
మొత్తానికి ‘మా’లో మళ్ళీ లొల్లి చేయడానికి బండ్ల గణేష్ తనదైన శైలిలో ముందుకుపోతున్నాడు. మరి పోటీలో దిగుతున్న బండ్ల గణేష్.. ఇప్పటికే ‘మా’ భవన్ నిర్మాణం పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు ‘మా’కి భవనం అవసరం లేదు అన్నాడు. మరి గెలుస్తాడో చూడాలి.