Avatar 3: హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు మన ఇండియన్ ఆడియన్స్ కూడా అమితంగా ఇష్టపడే ఇంగ్లీష్ చిత్రాలలో ఒకటి అవతార్. 2010 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కళ్ళు చెదిరే రేంజ్ వసూళ్లు వచ్చాయి. హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లాంటి థియేటర్స్ లో సంవత్సరాల తరబడి ఆడింది ఈ చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రాన్ని అమితంగా ఇష్టపడుతారు. పండోర అనే కల్పితపూరిత గ్రహంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించి ఒక కొత్త ప్రపంచాన్ని మన ఆడియన్స్ కి ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు డైరెక్టర్ జేమ్స్ కెమరూన్. ఆ రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఎన్నో హాలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా అవతార్ కలెక్షన్స్ ని అందుకోలేకపోయాయి.
2022 వ సంవత్సరం ‘అవతార్’ చిత్రానికి సీక్వెల్ గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని మాత్రమే దక్కించుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు మాత్రం భారీ రేంజ్ లో రాబట్టింది. సుమారుగా 2.3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అవతార్ 3 విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అవతార్ : ది ఫైర్ అండ్ యాష్’ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 19 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. మార్చి నెలలో ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ వీడియో ని విడుదల చేయబోతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ మాట్లాడుతూ ‘అవతార్ పార్ట్ 3 ఒక వెండితెర అద్భుతం అని మాత్రం చెప్పగలను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యానికి గురవుతారు. ముందు రెండు భాగాల్లో చూపించని పాత్రలు ఇందులో మీకు కనిపిస్తాయి. ఆ రెండు భాగాల్లో ఉన్న సన్నివేశాలను పునరావృత్తం కాకుండా న్యూ వెర్షన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒక సరికొత్త అద్భుత ప్రపంచం లోకి ప్రేక్షకులు ప్రయాణం చేసినట్టుగా ఈ చిత్రం ఉంటుంది. కొన్నిసార్లు రిస్క్ తీసుకొని ఆడియన్స్ కి థ్రిల్లింగ్ అనుభూతిని అందించాలి. లేకపోతే మనం పడిన కష్టం , సమయం, డబ్బులు వృధా అవుతుంది. నా మనసుకి ఎంతో సంతృపితిని ఇచ్చిన సినిమా ఈ అవతార్ 3 ‘ అంటూ చెప్పుకొచ్చాడు.