Sreeleela Arundhati Remake: ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ యుగం లో రీమేక్ సినిమాలు చేయడమంటే పెద్ద సాహసమే. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా రీమేక్ సినిమా చేస్తే చూడబోము అంటూ ఆడియన్స్ కొన్ని సినిమాలను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ చెప్పకనే చెప్పారు. కానీ ఇప్పటికీ కొంత మంది రీమేక్ సినిమాలనే నమ్ముకున్నారు. అది కూడా రిస్కీ రీమక్స్ తో కెరీర్ ని రిస్క్ లో పెట్టే రీమేక్ సినిమాలు అన్నమాట. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో ఎప్పటి నుండో అరుంధతి సినిమాని రీమేక్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముందుగా ఈ సినిమాని దీపికా పదుకొనే తో రీమేక్ చెయ్యాలని అనుకున్నారు. కానీ సోనాక్షి సిన్హా తో చేసిన ‘భాగమతి ‘ రీమేక్ ఘోరమైన ఫ్లాప్ అవ్వడంతో అరుంధతి రీమేక్ ఆలోచన ని పక్కన పెట్టేసారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ సినిమా రీమేక్ కోసం ఒక స్టార్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అట.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రం చేసిన మోహన్ రాజా(Mohan Raja). ఈయన తమిళనాడు లో రీమేక్ సినిమాలు చేయడం లో మంచి నేర్పరి. రీమేక్ చిత్రాలను చెడగొట్టకుండా, నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి జనాలకు నచ్చేట్టు చేయడం ఈయన స్పెషాలిటీ. ఇప్పుడు ఈయన టాలీవుడ్ చరిత్ర సృష్టించిన ‘అరుంధతి’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. హీరోయిన్ మరెవరో కాదు, శ్రీలీల(Srileela) అట. అయితే ఇది తమిళం లో రీమేక్ చేస్తాడా?, లేదా హిందీ లో రీమేక్ చేస్తాడా అనేది ఇంకా ఖరారు కాలేదు. అరుంధతి అనే చిత్రం ఇప్పటి వరకు టీవీ లలో వందల సార్లు టెలికాస్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పటి కాలం లో ఒక సినిమా హిట్ అయితే, అది ఏ భాషకు చెందినది అయినా కానీ, ఆడియన్స్ ఓటీటీ లో చూసేస్తున్నారు.
అలాంటిది ఎప్పుడో మన చిన్నతనం లో వచ్చిన ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి రీమేక్ అంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి?. అది కూడా శ్రీలీల తో అట. ఈమెకు డ్యాన్స్ తప్ప యాక్టింగ్ రాదు అనే ముద్ర జనాల్లో బలంగా పడింది. ‘భగవంత్ కేసరి’ లో ఒక్కటే కాస్త నటించింది కానీ, ఈమెకు బదులుగా వేరే హీరోయిన్ ని తీసుకొని ఉండుంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది అనే టాక్ అప్పట్లో వచ్చింది. అంత గొప్ప నటి ఆమె. అలాంటి హీరోయిన్ తో ఇలాంటి కల్ట్ క్లాసిక్ ని రీమేక్ చెయ్యాలని అనుకోవడం నిజంగా కత్తిమీద సాము లాంటిదే. ఎంత బాగా సినిమాలను తీసినా రీమేక్ అయితే జనాలు రిజెక్ట్ చేస్తున్న రోజులివి. అలాంటిది ఆరంభం లోనే హంసపాదు లాంటి కాంబినేషన్ తో ఈ అరుంధతి ని ఎలా చెడగొట్టబోతున్నారో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.