Annamayya movie unknown facts: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి అన్నమయ్య. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సంచలనం. భక్తి రస చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన చిత్రమిది. అప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్ మరియు రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న నాగార్జున తో ఇలాంటి రోల్ వేయించడమే పెద్ద సాహసం అనుకుంటే, ఆ రోల్ ని జనాలకు నచ్చే విధంగా తీయడం మాత్రమే కాకుండా, ఎన్ని తరాలు మారినా మర్చిపోలేని అద్భుతమైన క్లాసిక్ చిత్రం గా మలచడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలామందికి అసలు ఇందులో నటించింది నిజంగా నాగార్జున యేనా అనే అనుమానం ఉండేది. అంత అద్భుతంగా ఆయన పాత్రలో జీవించేసాడు. ఆరోజుల్లోనే ఈ చిత్రం 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్నమయ్య పాటలు పెడుతూ ఉంటారు. అలా చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రాన్ని అందించాడు నాగార్జున. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లో వెంకటేశ్వర స్వామి క్యారక్టర్ లో సుమన్ నటించిన సంగతి తెలిసిందే. సుమన్ దేవుడి క్యారక్టర్ లో అంత అద్భుతంగా, సహజం గా నటిస్తాడని ఆడియన్స్ ఊహించలేకపోయారు. ఎన్టీఆర్ తర్వాత దేవుడి క్యారక్టర్ చెయ్యాలంటే సుమన్ మాత్రమే చెయ్యాలి అనేంతగా ఆరోజుల్లో ఈ పాత్ర ద్వారా ఆయన ఆడియన్స్ రియాక్షన్ ని అందుకున్నాడు. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా సుమన్ తో చేయించాలని అనుకోలేదట. ముందుగా సీనియర్ నటుడు శోభన్ బాబు ని సంప్రదించారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంత రిక్వెస్ట్ చేసి చూసినా ఆయన ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ని సంప్రదించాలని అనుకున్నారట. బాలకృష్ణ కూడా ఈ పాత్రకు నూటికి నూరు శాతం సరిపోతాడు. కానీ బాలకృష్ణ, నాగార్జున లు ఒకే తరానికి చెందిన హీరోలు. ఇద్దరికీ సమానమైన స్టార్ ఇమేజ్,ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి పాదాలను మొక్కే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఆ పాత్ర చేసే బాలకృష్ణ కాళ్లకు నాగార్జున మొక్కితే బయట అభిమానుల మధ్య సంఘర్షణ ఏర్పడే అవకాశాలు ఉండడం తో బాలయ్య ని సంప్రదించే ఆలోచన ని విరమించారట. ఇక చివరికి ఈ క్యారక్టర్ కి సుమన్ అయితేనే న్యాయం చేయగలడని బలంగా నమ్మిన రాఘవేంద్ర రావు, రెండవ ఆలోచన లేకుండా అతన్ని సంప్రదించడం, సుమన్ ఈ క్యారక్టర్ చేయడానికి వెంటనే ఒప్పుకోవడం వంటివి జరిగాయి. ఇక ఆ తర్వాత హిస్టరీ ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే.