నటీనటులు: కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమర్, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్, ఆమని తదితరులు;
సంగీతం: నఫల్ రాజా;
సినిమాటోగ్రఫీ: అఖేర్, వెంకట్ ఆర్ శాఖమూరి, ఈజే వేణు;
ఎడిటింగ్: జె.ప్రతాప్ కుమార్;
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ;
కథ, దర్శకత్వం: రవీంద్ర, పుల్లె;
ఈ ‘అర్ధశతాబ్దం’కు స్టార్ హీరోలు, హీరోయిన్ లు లేరు. కథా బలంతోనే విజయం సాధిస్తోందని మేకర్స్ బలంగా నమ్మారు. దీనికి తోడు టీజర్ కూడా ఆసక్తిని రేకెత్తించింది. దాంతో ‘అర్ధశతాబ్దం’ పై అంచనాలు కలిగాయి. మరి ఆ అంచనాలకు ఫలితం దక్కిందా ? లేదా ? అనేది చూద్దాం.
కథాకమామీషుకి వస్తే.. ఊళ్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న కృష్ణ(కార్తీక్ రత్నం) ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తన తల్లి, చెల్లిని బాగా చూసుకోవాలని ఆశ పడతాడు. మరోపక్క తనతో పాటు చదువుకున్న పుష్ప (కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తూ ఆమె కోసం తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. కానీ అతగాడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. మరో వైపు ఊళ్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఊరి పెద్దలు కులం, రాజకీయ రంగుపులుముతున్న క్రమంలో కృష్ణ చేసిన ఓ పనికి ఊళ్లో గొడవలు మొదలవుతాయి. అసలు ఇంతకీ కృష్ణ పుష్పకు తన ప్రేమను తెలియజేశాడా ? లేదా అనేది మిగిలిన బాగోతం.
విశ్లేషణ :
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే.. ఆకలి బాధ తెలియని వాడు, ఆకలి చావుల గురించి పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో అల సాగుతుంది ఈ సినిమా వ్యవహారం. నీరసం తెప్పించే విప్లవ భావాలు, విసుగు మయంతో సాగే వర్గ పోరాటం, అర్ధం పర్ధం లేని శ్రమదోపిడి, వీటికితోడు అనవసరంగా ఇరికించిన కులాల గోలలు మొత్తంగా ఇదొక దిగువస్థాయి సినిమా.
హీరో కార్తీక్ రత్నం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని నటన చాతుర్యానికి మనకు ఏడుపు వస్తుంది. కార్తీక్ రత్నంను చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో హీరోలు కొరత ఉన్నట్టు అనిపిస్తోంది. ఇతగాడు కూడా హీరోగా ఎమోషన్ పండించడం, దాన్ని మనం చూసి తరించడం నిజంగా మనకు దక్కిన దిక్కుమాలిన అవకాశమే. కాబట్టి ఆ అవకాశానికి దూరంగా ఉండండి.
అసలు ఇలాంటి కథలను చేయాలంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల పై రక్తం మరగాలి. కానీ ‘అర్ధశతాబ్దం’ దర్శకుడికి రక్తం బదులు కనీసం చెమట కూడా చిందులేదు. మొత్తానికి దర్శకుడిగా అతగాడు పూర్తిగా తడబడ్డాడు. హీరోయిన్ కృష్ణప్రియ అందంగా కనిపించడానికి మేకప్ మెన్ ను పాపం బాగా ఇబ్బంది పెట్టినట్టు ఉంది. ఇక నవీన్‌చంద్ర ఈ సినిమాలో నటించి తన స్థాయిని సక్సెస్ ఫుల్ గా తగ్గించుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :
రెండు సాంగ్స్,
సీనియర్ నటీనటుల నటన,
విజువల్స్,
మైనస్ పాయింట్స్ ;
హీరో, అతగాడి యాక్టింగ్,
కథాకథనాలు,
సిల్లీ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రెగ్యులర్ లవ్ కంటెంట్,
రొటీన్ నేరేషన్,
నేపథ్య సంగీతం.
అన్నిటికి మించి ఈ సినిమా దర్శకడు పనితనం.
సినిమా చూడాలా ? వద్దా ?
ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ చెబుతుంది ఏమనగా దయచేసి ఈ రొటీన్ రొట్ట కొట్టుడు వ్యవహారాల తతంగాన్ని చూసి విసిగి వేసారి పోవద్దు అని మా మనవి.