
బాలీవుడ్ నటిగానే కాకుండా భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యగా దేశ, విదేశాల్లో క్రేజ్ సంపాదించుకుంది అనుష్క శర్మ. పెళ్లికాకముందు కోహ్లీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ బాలీవుడ్ బ్యూటీ పలు క్రికెట్ మ్యాచ్‌లకు హాజరైంది. మైదానంలో కోహ్లీ ఫోర్లు, సిక్సర్లు, సెంచరీలు కొడుతుంటే.. స్టాండ్స్ నుంచి గాల్లోకి ముద్దులు విసురుతూ కనిపించేది. ఒకరకంగా హీరోయిన్గా కంటే కోహ్లీ లవర్, వైఫ్ గానే ఆమె ఎక్కువ ఫేమస్ అయ్యిందని చెప్పొచ్చు.
అలాగని అనుష్క టాలెంట్‌ను తక్కువ చేయడానికి లేదు. ‘పీకే’ వంటి బ్లాక్బస్టర్చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఒకవైపు నటిస్తూనే నిర్మాతగా మారిందామె. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి, పారి సినిమాలు ఆ కోవకు చెందినవే. నిర్మాణ రంగంలో మరో అడుగు ముందుకేసిన ఆమె తాజాగా వెబ్ సిరీస్‌ల్లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు అమెజాన్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘పాతాల్ లోక్’ అనే హిందీ వెబ్ సిరీస్‌కు అనుష్క శర్మనే నిర్మాత. అయితే, ఈ సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. రెండో ఎపిసోడ్లో గూర్ఘా వర్గాన్ని కించపరిచే సంభాషణలు ఉన్నాయంటూ ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఘా యూత్.. ఈ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఓ న్యాయవాది అనుష్కకు నోటీసులు కూడా పంపించారు.
ఈ వెబ్ సిరీస్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్కు సిక్కిం లోక్ సభ ఎంపీ ఇంద్ర హంగ్ సుబ్బ లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. కానీ, ఇంత జరుగుతున్నా అనుష్క శర్మ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. విమర్శలను పట్టించుకోవడం లేదు. పైగా అమెజాన్ అంగీకరిస్తే ఈ వెబ్ సిరీస్‌లో రెండో సీజన్‌ను తెరకెక్కించేందుకు రెడీ అని చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. తాము నిజాయితీగా కథలు చెప్పాలకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని కోహ్లీ భార్య స్పష్టం చేసింది. రెండో సీజన్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే, దాని గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని తెలిపింది. ఏదేమైనా క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎలాంటి మొండిఘటమో.. సినిమాల విషయంలో అనుష్క శర్మ కూడా అదే కోవకు చెందిన వ్యక్తి అన్నమాట. అందుకే ఈ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యారు అనొచ్చు.