annatthe: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అన్నాత్తై. ఈ సినమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగపతిబాబు, కుష్బూ, నయనతార, కీర్తి సురేశ్, మీనా వంటి పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే నవంబరు 4న దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. దీంతో తలైవా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
మరోవైపు, టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్.. ఏపీ, తెలంగాణాలో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వెట్రి సినిమాటోగ్రాఫర్ కాగా.. రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవలె రజని నటించిన కబాలి, పేటా వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు ధరిస్తూ.. అభిమానులను అలరించారు. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్ కానప్పటికి.. మంచి టాక్ తెచ్చుకున్నాయి. రజనీ హీరోగా చివరగా వచ్చిన చిత్రం దర్బార్. పోలీస్‌గా చెలరేగిపోయి తనలో యవ్వనం అలాగే ఉందని నిరూపించారు. మరి అన్నాత్తై లో తలైవా లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా టీజర్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు రోబో తర్వాత పెద్దగా హిట్ సాధించని రజనీ.. ఈ సినిమాతోనైనా రికార్డు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.