Balakrishna: ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కి కూతురిగా నటిస్తుంది.
ఈ చిత్రం లోని బాలయ్య ఫస్ట్ లుక్ ని ఆయన పుట్టిన రోజు కానుకగా విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఇప్పటి వరకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ చూడని సరికొత్త బాలయ్య ని చూపించబోతున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. అతి త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇది వరకు కొన్ని టైటిల్స్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి, అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమే అట. ఈ చిత్రానికి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ని ఖారారు చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్. పేరు పలకడానికి కష్టం గా ఉన్నటువంటి ఈ టైటిల్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
టైటిల్ ప్రకటన రోజు కచ్చితంగా అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురుకోవాల్సి ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. మరి అభిమానుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. రీసెంట్ గానే హైదరాబాద్ లో శ్రీలీల మీద ఒక ప్రత్యేకమైన పాటని చిత్రీకరించారు. అలాగే శ్రీలీల ని బాలయ్య చెంపదెబ్బ కొట్టే సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య, ఈ చిత్రం తో ఆ ఊపుని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.