Anchor Suma : ‘విలన్ హీరో కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేశారంట’. ఇది ఓ మూవీలో డైలాగ్. ఇద్దరు కలిసి అసలు సంబంధం లేనోడ్ని బలి చేశారని దానర్థం. త్రివిక్రమ్-సుమ తమ మాటల గారడీ చూపించే క్రమంలో రాజీవ్ కనకాలను బుక్ చేశారు. సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ గెస్ట్ గా వచ్చారు. మైక్ అందుకుంటూనే ఆయన తన మార్క్ ప్రసంగం మొదలుపెట్టారు. సాధారణంగా సాయంత్రం నేనే వంట చేస్తాను. నేను ఇవాళ ఫంక్షన్ కి రావడం వలన మా ఆవిడ వంట చేస్తుంది.అందుకే తను రాలేదు. మీ తరపున ఆమెకు శుభాకాంక్షలు,అన్నారు .
అనంతరం యాంకర్ సుమ మీదకు ఆయన దృష్టి మళ్లింది. మిమల్ని ఇలా స్టేజి మీద చూడటం చాలా ఆనందంగా ఉంది. చూసిన ప్రతిసారి పొగడాలనిపిస్తుంది, అన్నారు. దానికి సుమ పొగడండి… ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నారు. గట్టిగా నవ్వేసి త్రివిక్రమ్, మీ డేట్స్ ఖాళీగా లేకపోయినా మా కోసం వచ్చారు. అందుకు ధన్యవాదాలు. సాధారణంగా సుమ వంట చేయరు. రాజీవే వంట చేస్తారు. ఎందుకంటే సుమ ఎప్పుడూ ప్రోగ్రామ్స్ అంటూ బయటే ఉంటారు. కాబట్టి ఆ వంట బాధ్యత రాజీవ్ దే అన్నారు.
ఒకసారి మా ఆవిడ స్టౌవ్ తగ్గించమంది. నేను ‘క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా ‘ అని అడిగాను. అప్పటి నుండి మా ఆవిడ వంట గదిలోకి రానివ్వలేదు అన్నారు. సుమ గురించి, భార్య గురించి వంట గురించి రెండు నిమిషాలకు పైగా మాట్లాడారు త్రివిక్రమ్. వేదికపై ఉన్న ధనుష్, సముద్ర ఖని వంటి స్టార్స్ ని, ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే. అయితే రాజీవ్ కనకాలను అనుకోకుండా బలి చేశారు. నేను ఇంట్లో వంట చేస్తాను అని చెప్పుకోవడంలో తప్పులేదు. పరపురుషుడు, ఒకరి భర్త చేస్తాడని చెబితేనే తేడా వస్తుంది.
త్రివిక్రమ్ కామెంట్ చూస్తే… సుమ పనిలో బిజీ, పనిలేని రాజీవ్ ఇంట్లో వంటా వార్పు చేస్తారని పరోక్షంగా చెప్పినట్లయ్యింది. త్రివిక్రమ్ ఈ మాటలు సరదాగానే చెప్పినప్పటికీ రాజీవ్ కనకాల మనసు నొచ్చుకునేలా ఉన్నాయి. సుమ ముఖంలో కూడా కొంచెం రంగులు మారాయి. సరసమైనా విరసమైనా అక్కడ ఉన్నోళ్ళతో పరిధిలో చేస్తే మంచిది. అయితే సుమ-త్రివిక్రమ్ సంభాషణ ఆడియన్స్ కి మంచి హాస్యం పంచింది. దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కించిన సార్ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.