Sankranti Movies: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50శాతం అక్సుపెన్సీని అమలు చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు తమ రిలీజు డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి.
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో థియేటర్లలో సంక్రాంతి కళ తప్పింది. ఈ సంక్రాంతికి నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ ఒక్కటే పెద్ద హీరో సినిమాగా రిలీజైంది. మిగతావన్నీ కూడా చిన్న సినిమాలే ఉన్నాయి. ఈ సంక్రాంతి తెలుగులో ‘బంగార్రాజు’తోపాటుగా దిల్ రాజు బ్యానర్లో నిర్మించిన ‘రౌడీ బాయ్స్’, మహేష్ బాబు మేనల్లుడు నటించిన ‘హీరో’, చిరంజీవి అల్లుడు నటించిన కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’, ‘హాట్ స్టోరీస్’ అనే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.
2022 సంక్రాంతి మూవీగా ‘బంగార్రాజు’ నిలిచింది. ఫర్ ఫెక్ట్ పండుగ సినిమాగా ‘బంగార్రాజు’ పేరు తెచ్చుకుంది. దీంతో గడిచిన మూడురోజులుగా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. అయితే జనవరి 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూతోపాటు థియేటర్లలో 50శాతం అక్సుపెన్సీ అమలు చేయాలనే నిబంధన అమల్లోకి రానుంది.
తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అత్యవసర భేటి నిర్వహించేందుకు నిర్ణయం ఇచ్చారు. తెలంగాణలోనూ థియేటర్లపై ఆంక్షలు విధిస్తే మాత్రం సంక్రాంతి సినిమాలన్నింటీకి పెద్ద మైనస్ గా మారే అవకాశం కన్పిస్తోంది.
ఇప్పటికే కర్ణాటలో నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50శాతం అక్సుపెన్సీతో సినిమాలు రన్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నిబంధనలు అమల్లోకి వస్తే సంక్రాంతి సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడనుంది. ఏపీలో మంచి కలెక్షన్ల దూసుకెళుతున్న ‘బంగార్రాజు’పై ప్రభావం పడటం ఖాయంగా కన్పిస్తోంది.