Amit Shah- Prabhas: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ నాయకులు సినిమా ప్రముఖులకు గాలం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు అమిత్ షా హైదరాబాద్ వస్తే చాలు ఓ చిత్ర ప్రముఖుడితో భేటీ అవుతున్నారు. గతంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిశారు. వీరి కలయిక రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అలాగే నితిన్ ని మరో సందర్భంలో కలిశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్ గెలుచుకోగా వారిని కలిసే ప్రయత్నం చేశారు. తెలంగాణాలో జరిగిన ఓ సభకు హాజరైన అమిత్ షా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని కలిసి అభినందించాలని ప్రణాళికలు వేశారు. అనుకోని కారణాలతో అది కుదరలేదు.
తాజాగా ఆయన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు సిద్ధం అవుతున్నారు. జూన్ 15న ఈ సభను తెలంగాణ బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. నేరుగా హైదరాబాద్ రానున్న అమిత్ షా సభకు ముందు రాజమౌళి, ప్రభాస్ లతో భేటీ కానున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న కలయిక అనడంలో ఎలాంటి సందేహం. కారణం రాజమౌళి, ప్రభాస్ లను అమిత్ షా ఇప్పుడు కలవాల్సిన అవసరం లేదు. బహుశా రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయమని అమిత్ షా కోరే అవకాశం కలదు.
ఇక హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీ ఆదిపురుష్ హీరోని కలవడం విశేషంగా మారనుంది. అందులోనూ ప్రభాస్ బీజేపీ సానుభూతిపరుడు. ప్రభాస్ పెదనాన్న దివంగత కృష్ణంరాజు బీజేపీ నాయకులు. ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేత. బీజేపీ ప్రభుత్వానికి ప్రభాస్ కోట్లలో విరాళాలు ఇచ్చారు. కాబట్టి బీజేపీ నేతలను కలిసేందుకు ప్రభాస్ ఆసక్తి చూపుతారు. ఇక రాజమౌళి కూడా బీజేపీకి అనుకూలుడే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని బీజేపీ రాజ్యసభకు పంపింది.
విజయేంద్ర ప్రసాద్ ఏకంగా ఆర్ ఎస్ ఎస్ భావజాలంపై ఓ కథ రాశారట. ఆ స్క్రిప్ట్ తనకు ఎంతగానో నచ్చిందని రాజమౌళి ఓ సందర్భంలో కొనియాడారు. ఆర్ ఎస్ ఎస్ బీజేపీ అనుబంధ సంస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రభాస్, రాజమౌళికి బీజేపీ పార్టీతో పాటు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిని కలవడం ద్వారా బీజేపీ ఎంతో కొంత ఓటు బ్యాంకు సాధించాలని కోరుకుంటుంది. ప్రభాస్ అభిమానులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అమిత్ షాతో రాజమౌళి, ప్రభాస్ ల భేటీ టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ కానుంది.