Allu Sirish: అల్లు శిరీష్ అలక వీడినట్లున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఫ్యామిలీతో కనిపించారు. దీంతో మనస్పర్థలు తొలగినట్లేనని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. అల్లు శిరీష్ కుటుంబంపై కోపంతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. కెరీర్ పరంగా వెనుకబడిపోయిన శిరీష్ తీవ్ర అసహనంతో ఉన్నారట. అన్నయ్య అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్ తన కెరీర్ గాలికి వదిలేశారనేది అల్లు శిరీష్ ఆవేదనట. టాప్ స్టార్, స్టార్ ప్రొడ్యూసర్ ఉండి కూడా తన కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లయిందనేది, శిరీష్ అసహనానికి కారణమట. దీంతో కుటుంబ సభ్యులపై అలిగి ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడనేది కథనాల సారాంశం.

ఈ కథనాలను బలపరిచేలా కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్, పండుగ సెలెబ్రేషన్స్ లో అల్లు శిరీష్ కనపడలేదు. దీంతో ప్రచారంలో ఉన్న వార్తలు నిజమేనని టాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు. అయితే తాజాగా ఫ్యామిలీ మెంబర్స్ తో శిరీష్ కనిపించారు. అల్లు అరవింద్ తండ్రి రామలింగయ్య పేరుపై అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ స్టూడియో లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, అరవింద్, వెంకట్ తో పాటు శిరీష్ పాల్గొన్నాడు.
ఈ క్రమంలో అలక వీడిన అల్లు శిరీష్ ముంబై నుండి వచ్చేశాడని, ఫ్యామిలీతో కలిసిపోయాడు అంటున్నారు. ఇక తాత రామలింగయ్య జయంతి వేడుకల్లో శిరీష్ పాల్గొననున్నాడట. ఏదైతేనేమి శిరీష్ తిరిగి కుటుంబంతో కలిసిపోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ప్రేమ కాదంట. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో, అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ప్రేమ కాదంట చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. నవంబర్ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శిరీష్ కి జంటగా అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతుంది. కాగా ప్రేమ కాదంట టైటిల్ మార్చనున్నట్లు సమాచారం. ఈ టైటిల్ పట్ల యూనిట్ సంతృప్తి కరంగా లేని కారణంగా టైటిల్ మార్చి విడుదల చేస్తారట. మరోవైపు అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట. ఈ వార్తలను ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం విశేషం. అల్లు శిరీష్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తుండగా ఒక్క సాలిడ్ హిట్ పడలేదు.