Tandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అభిమానులకు ఎంట్రీ లేకుండా కేవలం మూవీ టీం మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొనేలా ప్లాన్ చేసారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 1న ప్లాన్ చేసారు. అల్లు అర్జున్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫిబ్రవరి 2వ తేదికి మార్చారు. అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సందీప్ వంగ కూడా ముఖ్య అతిథిగా హాజరు అవుతాడని చెప్పారు.
కానీ సందీప్ వంగ మాత్రమే హాజరయ్యాడు, అల్లు అర్జున్ కోసం అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూపులు తిప్పుకోకుండా చూసారు. ఎంతసేపు ఎదురు చూసినా అల్లు అర్జున్ రాకపోవడంతో, ఇక ఆయన ఈ ఈవెంట్ కి హాజరు కావడం లేదని అధికారికంగా తెలిసింది. కారణం అల్లు అర్జున్ హైదరాబాద్ లో లేదట. కొత్త సినిమా స్టోరీ చర్చల కోసం ఆయన గత వారం రోజులుగా ముంబై లోనే మకాం వేసాడట. ఈ కొత్త సినిమా వివరాలేంటో ఇంకా బయటకి రాలేదు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ మీద బయటకి రావడం, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అల్లు అర్జున్ పై ఘాటు విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో నాటకీయ పరిస్థితులు డిసెంబర్ నెలలో జరిగాయి.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా కోలుకోకపోవడంతో ‘పుష్ప 2’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయలేకపోయాడు. దేశవ్యాప్తంగా ఎన్నో సక్సెస్ టూర్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ క్యాన్సిల్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి అల్లు అర్జున్ బయట కనిపించలేదు. మధ్యలో రెండుసార్లు పోలీస్ స్టేషన్ కి సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు కనిపించాడు కానీ, పూర్తిస్థాయిలో మీడియా ముందుకు రాలేదు. దీంతో అల్లు అర్జున్ ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథి గా వస్తున్నాడు అనే వార్త తెలియగానే అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ అసలు ఏమి మాట్లాడబోతున్నాడో వినడానికి ఆతృతగా ఎదురు చూసారు. కానీ చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టడంతో అందరూ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఇక మళ్ళీ అల్లు అర్జున్ ని మీడియా ముందుకు, లేదా అభిమానులు ముందుకొచ్చి ఎప్పుడు మాట్లాడుతాడో చూడాలి. ఆయన కొత్త సినిమా విడుదల అవ్వాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే, అప్పటి వరకు ఎదురు చూడాలేమో!.