
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న పుష్ప షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యమయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంది.
మారేడుమిల్లి షెడ్యూల్ కంప్లీట్ కావటంతో చిత్ర బృందం లాంగ్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లారని సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ తన గారాల పట్టి అర్హని చాలా మిస్ అవుతున్నట్లుగా ఇంస్టాగ్రామ్ లో “ఐ మిస్ యూ అర్హ” అంటూ ఒక వీడియో పోస్ట్ చేయటం జరిగింది. ఆ వీడియోలో చిన్నారి అర్హ తండ్రి అల్లు అర్జున్ తో ‘బెండకాయ… దొండకాయ… నువ్వు నా గుండెకాయ’ అని చెప్పగా ఆ మాటలకి ఆయన ముసిముసిగా నవ్వుకున్నారు. స్టైలిష్ స్టార్ ఇలానే రెగ్యులర్ గా తన పిల్లల వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటారు.
ఇక పుష్ప సినిమా విషయానికొస్తే… అల్లు అర్జున్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవలనే అధికారికంగా ప్రకటించారు.