Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ఫస్ట్ పార్ట్ ను ముగించే పనిలో ఉన్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు బన్నీ. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ కోసం.. ఏపీలోని మారేడు మిల్లి అడవులకు వెళ్లింది యూనిట్. అయితే.. వర్షాల కారనంగా అక్కడ లొకేషన్ లో ఇబ్బందులు తలెత్తడంతో.. కాకినాడకు బయల్దేరింది చిత్ర బృందం.
ఈ క్రమంలో గోకవరం సమీపంలోని ఓ చిన్న హోటల్ లో టిఫెన్ తిన్నాడు బన్నీ. పూరిగుడిసెలో నడిపిస్తున్న కాకా హోటల్ కు అల్లు అర్జున్ వెల్లడంతో.. యజమాని షాకయ్యాడు. మంచి దోశ వేసి, బన్నీకి అందించాడు. టిఫెన్ తినడం పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వపోగా.. తీసుకోవడానికి యజమాని నిరాకరించాడు. అయినప్పటికీ.. వెయ్యి రూపాయలు ఆయన చేతిలో పెట్టాడు బన్నీ.
అల్పాహారం తింటున్నప్పుడు హోటల్ యజమానితో మాట్లాడిన బన్నీ.. అతని ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకున్నట్టు సమాచారం. దీంతో.. అతని పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పగా.. బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ రావాలని చెప్పాడట. అక్కడ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని సదరు హోటల్ యజమాని స్వయంగా తెలిపాడు.
అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఎంతో ఆత్మీయంగా పలకరించాడని, సదరు హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ టిఫెన్ తినడానికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడ టిఫెన్ చేసిన బన్నీ.. రాజమండ్రి వైపునకు వెళ్లిపోయాడు.
ఇదిలాఉంటే.. పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా షూటింగ్ కొనసాగిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధిచిన భారీ సన్నివేశాలను కాకినాడలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.