Allu Aravind: 17 ఏళ్లు వెనక్కి వెళ్దాం. శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఇది పాత్రాభినయం చేసిన అందరివాడు సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఈ సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ భారీగా నష్టపోయారు. ఇప్పట్లోలా ఓటిటిలు గట్రా ఉంటే ఎంతో కొంత గట్టెక్కే వారేమో!? కానీ అప్పట్లో ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మరో సినిమా నిర్మించాలనే ధైర్యం చేయలేదు. కానీ అదే సమయంలో ఆయనకు అదృష్టం ఏఆర్ మురగదాస్ రూపంలో లభించింది. అప్పటికే ఆయన విజయకాంత్ హీరోగా రమణ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇది తెలుగులో ఠాగూర్ గా రీమేక్ అయింది. చిరంజీవి కెరీర్ లోనే ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. దానిని మధు నిర్మించినా.. నైజాం హక్కులు మాత్రం అరవిందే తీసుకున్నారు.

ఠాగూర్ ద్వారా సంపాదించింది అందరివాడుతో పోయింది. ఈ సమయంలోనే మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా గజిని సినిమా విడుదలయింది. తమిళ చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. ఈ సినిమాపై మనసు పడిన అరవింద్ ఫ్యాన్సీ రేటుకి తెలుగు డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేశారు. అప్పటికే ఆయన చేతిలో లెక్కకు మిక్కిలి సినిమా థియేటర్లు ఉండటంతో భారీగా విడుదల చేశారు. ఫలితంగా అందరి వాడితో పోగొట్టుకున్న డబ్బులు అన్ని వెనక్కి తిరిగి వచ్చాయి. ఎలాగో రీమేక్ హక్కులను కొనుగోలు చేయడంతో మురగదాస్ దర్శకత్వంలోనే హిందీలో అమీర్ ఖాన్ హీరోగా గజిని సినిమాను నిర్మించి భారీగా లాభాలు గడించారు. అలా సంపాదించిన డబ్బులతోనే అప్పట్లో కోకాపేటలో భూములు కొన్నారని వినికిడి. ఆ భూములోనే ప్రస్తుతం అల్లు స్టూడియోస్ నిర్మించినట్టు తెలుస్తోంది. గజిని తెలుగులో రీమేక్ అయిన నాటి నుంచి నేటి వరకూ ఒకటి రెండు మినహా అల్లు అరవింద్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ పట్టిందల్లా బంగారం అయ్యాయి.
ఇప్పటి పరిస్థితిలోకి వస్తే
బహుశా అల వైకుంఠపురం (ఇందులో వాటాదారు మాత్రమే) మినహా ఇప్పటివరకు అల్లు అరవింద్ చేపట్టిన ప్రాజెక్టులన్ని దాదాపుగా నష్టాలు తీసుకొచ్చాయి. ఆహా యాప్ లాభాల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని సినీ పండితులు చెబుతున్నారు. పైగా ఇది కూడా అల్లు అరవింద్ సొంతం కాదు. ఇందులో వాటాదారులుగా మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు అర్జెంటుగా లాభాలు తెచ్చిపెట్టే ఒక సినిమా కావాల్సి వచ్చింది. అయితే తాను తలిచేది.. దైవం అనుకునేది ఒకటే అన్నట్టుగా.. ఇటీవల కన్నడలో విడుదలై భారత చిత్ర పరిశ్రమనే ఒక ఊపు ఊపుతున్న కాంతారా అల్లు అరవింద్ దృష్టిలో పడింది. వెంటనే ఈ సినిమాను నిర్మించిన హోంబలే ప్రొడక్షన్ అధిపతి విజయ్ కరంగదూర్ ను కలిశాడు.

ఈయన మరెవరో కాదు కేజీఎఫ్ నిర్మాత. విజయ్ కరంగదూర్ కు వారాహి అధినేత సాయి కొర్రపాట్లు అత్యంత ఆప్తుడు అయినప్పటికీ.. అల్లు అరవింద్ వైపే మొగ్గు చూపారు. కేవలం కోటి రూపాయలకు ఈ సినిమా తెలుగు హక్కుల్ని అరవింద్ కొనుగోలు చేసి ఇటీవల విడుదల చేశారు. పోటీలో గాడ్ ఫాదర్ మిగతా చిత్రా లేవి లేకపోవడం, కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో కాంతారాకు మంచి బజ్ ఏర్పడింది. పైగా అల్లు అరవింద్ చేతిలో లెక్కకు మిక్కిలి థియేటర్లో ఉండడంతో గ్రాండ్ గా విడుదల చేశాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తెలుగులో రిలీజ్ అయిన ఒక్కరోజే కాంతారా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇకపై వచ్చేవన్ని లాభాలే. గతంలో ఈ తరహా ముందు చూపుతో దివంగత నిర్మాత కాట్రగడ్డ మురారి ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని అల్లు అరవింద్ భర్తీ చేస్తున్నారు. ఎంతైనా అల్లు అరవింద్ మందు చూపు మామూలుగా ఉండదని సినీ పరిశ్రమ పెద్దలు అంటున్నారు. కాంతారా ఇచ్చిన ఉత్సాహంతో ఇకపై కన్నడలో రిశబ్ శెట్టి నటించే సినిమాలన్నీ తానే సొంతంగా విడుదల చేయనున్నట్టు ఇటీవల అల్లు అరవింద్ ప్రకటించారు. అన్నట్టు రిషబ్ షెట్టి చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.