Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు 100వ వసంతంలోకి అడుగు పెడుతున్న రోజు ఇది. 83 ఏళ్ల తన తెలుగు సినీ ప్రస్థానంలో 78 ఏళ్ళు తన నటనతో అందరిని అలరించిన ఏకైక లెజెండ్ మన అక్కినేని.. తెలుగు సినిమాకు బాలరాజు, బాలచంద్రుడు, భగ్న ప్రేమికుడు దేవదాసు, కాళిదాసు, కబీరు, అర్జునుడు, అభిమన్యుడతడే!. అసలు అక్కినేని రికార్డులు బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. మొత్తం 256 చిత్రాలు, 27 తమిళ్.. 1 హిందీ.. .30 జూబ్లీ చిత్రాలు.. 145 శతదినోత్సవ చిత్రాలు.. 1 హిందీ జూబ్లీ.. 3 భాషల్లో జూబ్లీ కల ఏకైక నటుడు.. 74 మంది దర్శకులతో, 62 మంది హీరోయిన్స్ లతో కలిసి పని చేశారు. 1200+ అవార్డ్స్ అందుకున్న ఏకైక హీరో ఒక్క అక్కినేనినే. ఇక పద్మశ్రీ , పద్మ విభూషన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. ఇవ్వన్నీ కలిపితే మన అక్కినేని. దటీజ్ ఏఎన్నార్. అక్కినేని నాగేశ్వరరావు హీరో కాదు, తనను తానూ హీరోగా మలుచుకున్న నిజమైన హీరో.
తెలుగు సినీ కళామతల్లి ఎదుగుతున్న రోజుల్లోనే తొలితరం సూపర్ స్టార్స్ లో మొదటి సూపర్ స్టార్ ఏఎన్నారే. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ వచ్చారు. ఇక ఎన్టీఆర్ ప్రభంజనంలో నిలబడగలిగిన ఏకైక హీరో కూడా ఒక్క ఏఎన్నారే. అంతటి విశిష్ట ప్రస్థానం ఉంది అక్కినేనికి. అక్కినేని మాటల మనిషి కాదు, చేతల మనిషి. అందుకే ఆయన అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోలేదు. శ్రమనే పెట్టుబడిగా పెట్టి, తనదైన కోణంలో తెలుగు వెండితెరపై వెలిగిపోయిన రొమాంటిక్ హీరో ఆయన.
Also Read: Minister Rk Roja: రోజా రీ ఎంట్రీ.. దసరాకు జబర్దస్త్ స్టేజీపై సందడి చేయనున్న ఫైర్‌బ్రాండ్!
కానీ, నాగేశ్వరరావు ఏఎన్నార్ గా మారడానికి చాలా కృషి చేశారు. మద్రాసు మహానగరంలో అడుగుపెట్టిన రోజున ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ, ఆ తర్వాత ఏఎన్నార్ గొప్ప మాటలను రాసే స్థాయికి ఎదిగారు. పెద్దగా చదువుకొని ఏఎన్నార్ ‘అ..ఆ లు అక్కినేని ఆలోచనలు’ అనే మంచి పుస్తకాన్ని రాయగలిగారు అంటే.. అది అక్కినేనికే సాధ్యం అయింది.
ఆయనలో ఉన్న మరో అంశం.. చేసిన తప్పును మళ్ళీ చేయరు. అందుకే.. తన జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని జీవిత అనుభవాలను గొప్ప పాఠాలుగా మలుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి అరుదైన పురస్కారాలు దక్కినా ఆయన ఎన్నడూ పొంగిపోలేదు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ మనిషిలానే ఆయన నిత్యం నేర్చుకుంటూ చివరి క్షణం వరకు అలాగే గడిపారు.
అక్కినేని తన పుస్తకంలో రాస్తూ.. ‘అనుభవం మీద నేను నేర్చుకున్నది ఏమంటే నాకు ఎదురైన ప్రతి కీడూ కూడా మేలుగా పరిణమించిందని. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, తరచు ప్రయత్నించే చీమలా అపజయాన్ని అంగీకరించకూడదనేదే నా మతం. సదరు అపజయాన్ని సవాలు చేస్తూ మనిషి తిరిగి.. తిరిగి ప్రయత్నం చేయాలి’ ఇది అక్కినేని మాట కాదు, జీవితాంతం ఆయన పాటించిన విజయం సూక్తి. కాగా నేడు ఆయన జయంతి సందర్భంగా యావత్తు ఆయన అభిమాన లోకంతో పాటు మనం ఆయనను స్మరించుకుందాం.
Also Read:Allu Arjun: అల్లు అర్జున్ మాటతో ట్రెండింగ్ లోకి ఆ అమ్మాయి ?, ఇంతకీ ఎవరు ఆమె ? ఎక్కడ నుంచి వచ్చింది ?