Akhil Agent: 2023 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. ఆల్రెడీ నలుగురు బిగ్ స్టార్స్ తమ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ వారసుడు, బాలకృష్ణ వీరసింహారెడ్డి అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య పొంగల్ రేసులో ఉన్నట్లు స్పష్టం చేశాయి. నలుగురు పెద్ద హీరోల సమరం మధ్యలోకి నేనున్నా అంటూ వస్తున్నాడు అక్కినేని అఖిల్. దీపావళి పండగ సందర్భంగా ఏజెంట్ మూవీ రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఏజెంట్ సైతం సంక్రాంతి బరిలో దిగుతున్నాడంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

ఇంత పెద్ద సమరంలోకి కనీసం హీరోగా నిలదొక్కుకోని అఖిల్ రావడం ఆశ్చర్యంగా వేస్తుంది. అదే సమయంలో ఆయన ధైర్యానికి కారణం ఏమిటని చిత్ర వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఎస్టాబ్లిష్ అయిన టైర్ టూ హీరోలు కూడా ప్రభాస్, చిరంజీవి, బాలయ్య వంటి స్టార్స్ కి ఎదురెళ్లడానికి సాహసం చేయరు. అలాంటిది వాళ్ళు అధికారిక ప్రకటన చేశాక కూడా ఏజెంట్ విడుదల సంక్రాంతికి ఉంటుందని చెప్పడం విడ్డూరంగా మారింది.
ఒకవేళ ఏజెంట్ మూవీలో విషయం ఉంది, మంచి కంటెంట్ తో తెరకెక్కిందని అఖిల్ గట్టిగా నమ్ముతున్నారేమో. పెద్ద హీరోలతో పోటీకి సిద్ధం కావడానికి కారణం ఏమైనా కానీ అఖిల్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లే లెక్క. ఇమేజ్ లో ఫ్యాన్ బేస్ లో ఎక్కడో ఉన్న అఖిల్ పోటీ మధ్య నెట్టుకురావడం అంత ఈజీ కాదు. అందులోనూ విడుదలవుతున్న నాలుగు సినిమాలకే థియేటర్స్ సమస్య రావచ్చు. అఖిల్ రాకతో ఈ సమస్య మరింత అధికం అవుతుంది. ఇక చూడాలి సంక్రాంతి పోటీ ఎలాంటి మలుపు తీసుకోనుందో.
దర్శకుడు సురేంధర్ రెడ్డి స్పై థ్రిల్లర్ గా ఏజెంట్ మూవీ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఉన్నారు. మమ్ముట్టి కీలక రోల్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్. హిప్ హాఫ్ తమిజా సంగీతం అందిస్తున్నారు.