Pedda Kapu: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆయనకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మహేష్ వంటి స్టార్ అడిగితే డేట్స్ ఇచ్చే రేంజ్ కి వెళ్ళాడు. మహేష్ తో చేసిన రెండో చిత్రం బ్రహ్మోత్సవం భారీ దెబ్బేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేసే క్రమంలో శ్రీకాంత్ అడ్డాల ఆలోచనలు విఫలం చెందాయి. భారీ స్టార్ కాస్ట్ తో ఆయన సీరియల్ తీశారన్న విమర్శలు వినిపించాయి. మహేష్ కెరీర్లో భారీ డిజాస్టర్స్ లో బ్రహ్మోత్సవం కూడా ఒకటి.
దీంతో శ్రీకాంత్ అడ్డాలకు బాగా గ్యాప్ వచ్చింది. నిర్మాత సురేష్ బాబు అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకున్నారు. వెంకీ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప నేరుగా ఓటీటీలో విడుదలైంది కాబట్టి చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా అది ఆయనకు ఎలాంటి మేలు చేయలేదు. టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయారు. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాతో బిజీ. దీంతో శ్రీకాంత్ అడ్డాల టైర్ టూ హీరోల వైపు చూశారు.
అనూహ్యంగా ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. అఖండ చిత్ర నిర్మాతలు ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో మిర్యాల రవీందర్ రెడ్డి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడట. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ పెదకాపు అంట. క్యాస్ట్, పాలిటిక్స్, సామాజిక సమస్యల ఆధారంగా ఈ మూవీ ఉంటుందట.
పెద కాపు మూవీలో శ్రీకాంత్ అడ్డాల అనేక వివాదాస్పద అంశాలు ప్రస్తావించారనే ఓ ప్రచారం జరుగుతుంది. యాక్షన్, వైలెన్స్ కలిగిన సోషల్ సబ్జెక్టు అంటున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూన్ 2న రివీల్ చేస్తామని చెప్పారు. అప్పుడే ఈ మూవీ టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల వంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఎలాంటి మూవీ చేస్తారో చూడాలి. ఇక అఖండ మూవీతో మిర్యాల రవీందర్ రెడ్డి భారీ విజయం సొంతం చేసుకున్నారు. కోట్లు కొల్లగొట్టారు.