
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్ ఉన్న అందాల తార చనిపోయింది. కేరళకు చెందిన ప్రముఖ సినీ, బుల్లితెర నటి శరణ్య శశి(35) అనారోగ్యంతో మరణించడం విషాదం నింపింది.
కొన్నాళ్లుగా శరణ్యశశి క్యాన్సర్ (బ్రెయిన్ ట్యూమర్)తో బాధపడుతోంది. ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచింది. అనారోగ్యం దృష్ట్యా 11 సార్లు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఈమె ఎదుర్కొంది. ఆ సమయంలో హీరోయిన్ కోసం సన్నిహితులు, శ్రేయోభిలాషులు నిధులు సమీకరించారు.
ఈ క్రమంలోనే మేలో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైరస్ నుంచి కోలుకున్నా న్యూమోనియా, శ్వాస సంబంధ సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి తనువు చాలించింది.
కన్నూరు జిల్లాలోని పళయంగడికి చెందిన శరణ్య ‘చాక్కో రండమన్’, చోటా ముంబై లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ముత్తకోడి, సీత , హరిచందనం లాంటి సీరియళ్లతో బుల్లితెరపై కూడా ఫేమస్ అయ్యింది. ఈమె మృతి కేరళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నింపింది.