బిగ్ బాస్ సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని మొదటిసారి చూడగానే అబ్బో ఎవరో ఇతను, టాస్కులు కుమ్మేసేలా ఉన్నాడే అని అనుకుంటాము, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కంటెస్టెంట్స్ ఆట తీరుని చూసిన తర్వాత బిల్డప్స్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని అనిపిస్తాది. అలా ఈ సీజన్ లో ప్రేక్షకులకు అనిపిస్తున్న కంటెస్టెంట్స్ లో ఒకరు అభయ్. ఇతను హౌస్ లోకి అడుగుపెట్టగానే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకడు, టాప్ 5 వరకు వచ్చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆ అంచనాలకు ఏ మాత్రం ఇతను చేరుకోవడం లేదు. హౌస్ లో ఇతనికంటే ప్రేరణ, యష్మీ వంటి లేడీ కంటెస్టెంట్స్ అద్భుతంగా టాస్కులు ఆడుతున్నారు. దానికి తోడు ఈయన నోరు జారుతూ వదిలే కొన్ని మాటలు చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లోనే ఈయన కిరాక్ సీత పై ఎన్నో లూజ్ మాటలు వదిలాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టే కార్యక్రమాలు కూడా చాలానే చేసాడు. ఒకరి దగ్గర ఒకలాగా మాట్లాడుతాడు, మరో కంటెస్టెంట్ దగ్గర ఇంకోలా మాట్లాడుతాడు.
రోజులు గడిచే కొద్దీ జనాల్లో మొదట్లో ఇతనిపై ఉన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆయన డేంజర్ జోన్ లో కొనసాగుతున్నాడు. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నేడు ఈయన ఏకంగా బిగ్ బాస్ మీదనే నోరు జారేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ వంట గదిలో ఈ వారం వంట చేసుకునే సమయాన్ని లిమిట్ చేసాడు. ఈ వారం మొత్తం కలిపి కేవలం 14 గంటలు మాత్రమే వంట చేసుకోవడానికి సమయాన్ని వినియోగించుకోవాలి. ఒక గంటని ఏర్పాటు చేసాడు, వంట చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ గంటని కొడితే బిగ్ బాస్ గ్యాస్ స్టవ్ ని ఆన్ చేస్తాడు. మళ్ళీ వంట ముగిసిన తర్వాత గంట కొడితే గ్యాస్ స్టవ్ ని ఆపేస్తాడు. నిన్ననే ఇది ప్రారంభమైంది. మొదటి రోజే కంటెస్టెంట్స్ 14 గంటల్లో గంట 30 నిమిషాలు వాడేశారు.
నేడు వంట గదికి సంబంధించి మరికొన్ని లిమిట్స్ పెడుతూ బిగ్ బాస్ ‘ఒకే సమయం లో, ఒక్క క్లాన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ మాత్రమే వంట చేసుకోవాలి. ఆ సమయంలో వంట గదిలో ఆ క్లాన్ కి సంబంధించిన వారు ముగ్గురు మాత్రమే సహాయంగా రావాలి’ అని అంటాడు. ఈ రూల్స్ కి చిరాకు ఎత్తిపోయిన అభయ్ ‘మనిషి పుట్టుక పుట్టినవాళ్లేనా ఈ బిగ్ బాస్ వాళ్ళు. ముగ్గురితో ఇంటి మొత్తానికి ఆహరం ఎలా వండగలం. తినడానికి టాస్కులు పెడుతున్నారా, లేకపోతే తినకుండా ఉండేందుకు టాస్కులు పెడుతున్నారా’ అని అంటాడు. ఈ మాటలకు అభయ్ పై బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీకెండ్ లో నాగార్జున నుండి కోటింగ్ వేరే లెవెల్ లో కూడా ఉండొచ్చు.