Adipurush Review : రామాయణం ఎవరు రాశారు? ఇంకెవరు ముమ్మాటికీ వాల్మీకే. ఇది కూడా ఓ ప్రశ్నేనా? ఎందుకంటే ఆది పురుష్ చూసిన తర్వాత ఇలాంటి ఒక ప్రశ్న కచ్చితంగా సంధించాలి. ఎందుకంటే ఆదిపురుష్ చాలావరకు అవాల్మీకం లాగానే ఉంది.. ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ తో పోలిస్తే నాసిరకం గ్రాఫికాయణం లాగా ఉంది. రావణాయణం లాగా ఉంది. ఆధునిక సీత, సిక్స్ ప్యాక్ రాముడి లాగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే వార్ ఎవెంజర్ వీడియో లాగా ఉంది. ఐరన్ మ్యాన్ తరం కోసం ప్రీమియర్ షో లాగా ఉంది. అంటే సినిమా ఇలా ఉండాలా? ఉండకూడదా? అని చెప్పడానికి మనం ఎవరం? ఆ లెక్కకు వస్తే ప్రభాస్ తో మాత్రమే రామాయణం మొదలు కాలేదు. అలాగని ప్రభాస్ ఆదిపురుష్ తోనే ఇది పూర్తి కాదు. తెరపైన ఎన్ని రామాయణాలు వచ్చాయో.. అవి రూపుదిద్దుకునేందుకు అన్ని రామాయణాలూ రాయబడ్డాయి. కల్పవృక్షం, విష వృక్షం, ఆనంద, గోపీనాథ, శేష, ఉత్తర, భాస్కర, నిర్వచనోత్తర, రంగనాథ, మొల్ల, ఆధ్యాత్మ, సత్యపురి, కూచకొండ.. ఇలా ఎన్నో రామాయణాలు ఉన్నాయి. పద్య గేయంలో, వచన రూపంలో ఎన్ని రామాయణాలు ఉన్నాయో లెక్కపెట్టలేం.. ఈ జాబితాలో ఆదిపురుష్ అనేది ఒక భాగం మాత్రమే. ఈ సినిమా బాపు సంపూర్ణ రామాయణానికి పోస్ట్ మోడ్రన్ రూపంలో కనిపిస్తుంది. అందులో లాగానే అరణ్యకాండలో మొదలై యుద్ధకాండలో ముగుస్తుంది.
అన్నీ అవాల్మికాలే
ఇప్పటివరకు తెలుగు మాత్రమే కాదు, సంస్కృతం లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రూపొందిన రామాయణాలు మొత్తం అవాల్మికాలే. విభీషణుడు రావణ గర్భంలోని అమృతభాండం పగలగొట్టడం, గౌతముడిని అహల్యను వేరు చేసేందుకు ఇంద్రుడు కోకిల మాదిరి కూయడం, అహల్య రాయిలాగా మారడం, శంభూక వధ, కాలనేమి కథ, శబరి ఎంగిలి పండ్ల వ్యవహారం, లక్ష్మణ దేవర నవ్వు, జంబూ మాలి వృత్తాంతం, సులోచన సహగమనం, సీత ఎత్తిపొడుపును తట్టుకోలేక లక్ష్మణుడు అన్నను వెతకడానికి వెళ్లడం, రావణుడు విభీషణుడిని తన్ని వెళ్ళగొట్టడం, ఉడతలు రామ భక్తిని ప్రదర్శించడం, రావణుడి ముందు హనుమంతుడు తన తోకతో సింహాసనం వేయడం, బాల్యంలో తన కాలును విరిచాడని కోపంతో మందర శ్రీరాముడిని వనవాసానికి పంపడం, కైక 14 రోజులు అనబోయి 14 సంవత్సరాలు అనడం, యాగానికి ఆటంకం కలిగించిన రాక్షసులను రాముడు సంహరించడం.. ఇలా వాల్మీకి రాయని ఎన్నో రాముడి వృత్తాంతాలు ప్రచారానికి వచ్చాయి. సినిమాల రూపంలో ప్రతీ రోజూ మన ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ ద్వారా ఓం రౌత్ వాటిని మళ్లీ తెరమీద తెచ్చాడు.
ఇవి కూడా కొత్తగానే ఉన్నాయి
సాధారణంగా రామాయణ వృత్తాంతం ప్రకారం ఆంజనేయుడు సంజీవని మొక్కను గుర్తించలేక మొత్తం కొండనే ఎత్తుకొచ్చాడు అనే ప్రచారం మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో ఆంజనేయుడు సంజీవని ఔషధంతోపాటు ఇంకా చాలామందికి అవసరం పడుతుందని కొండని కూడా పెకిలించుకు వస్తాడు. హనుమ ఫీవర్ కాలంలో ఇలా చూపించడం ఎలా సరైందో ఆ దర్శకుడికే తెలియాలి. వాలిని చెట్టు చాటు నుంచి రాముడు చంపడమే మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం మల్ల యుద్ధంలో ఆయుధం వాడటం అనే అధర్మానికి పాల్పడినందు వల్ల రాముడి చేతిలో అతడు మరణిస్తాడు. చెట్టు చాటు నుంచి చంపాడు అనే అపనిందను కూడా రాముడికి అంటనివ్వకుండా దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. సుగ్రీవుడి వైపు రాముడు నిలబడటం, ప్రజలను కాపాడే వాడే నిజమైన రాజు అని చెప్పడం, ఇది బాహుబలి నాటి అవాల్మికం. సీత ఎత్తిపొడుపు లేకుండానే శేషు రాముడి దగ్గరకు లక్ష్మణుడు వెళ్లిపోతాడు. లక్ష్మణుడిని రాముడు శేషు అని పిలిచినట్టు ఒక వింత అయితే, అది ఇంతవరకు ఏ పుస్తకంలోనూ, చిత్రంలోనూ వినిపించకపోవడం మరో వింత. ఇక ఆంజనేయుడిని కూడా భజరంగ్ అని పిలిపించారు. రావణుడి కడుపులోని అమృత భాండం గురించి రహస్యం విప్పడమనేది ఆది పురుష విభీషణంలో లేదు. రావణాసురుడి పొట్టలో బాణం దింపే రాముడు చంపేస్తాడు. ఓ మాయావిని సీత విషయంలో రాముడికి అప్పగించి చివరి నిమిషంలో ఆమె మెడకు కత్తి పెట్టడం వంటి సీన్లు చవక బారు లాగా అనిపిస్తాయి. అసలు ఈ సినిమాలో రావణుడిదే ముతక గెటప్. రామాయణ పాఠకులకు రావణుడిలో సీతను ఎత్తుకు రావడం అనే చెడ్డతనం తప్ప అన్నీ మంచి లక్షణాలు ఉన్నట్టుగానే తెలుసు. రాముడు ఆహార్యం, రూపం మనకు తెలిసిన ఊహల్లో రావణబ్రహ్మగా గౌరవ ప్రదంగానే ఉంటుంది. కానీ ఇక్కడ దర్శకుడు రావణుడిని మరీ సీ గ్రేడ్ విలన్ గా చూపించాడు.
ఉత్తర రాముడు
ఇక సినిమాలో ప్రభాస్ ఉత్తర భారత రాముడి లాగా కనిపించాడు. బహుశా పాన్ ఇండియా లెక్కల వల్ల కావచ్చు. ఇందులో మహిళల ఆహార్యం కూడా “కుర్తా కం లాంగ్ గౌన్ ” లతో మెరిసి పోయింది. ఇక లంకేయులు పాత సినిమాల్లో గాడ్జిల్లా లాగా కనిపించారు. వారిని చూస్తే “రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ” గుర్తుకు రావడం ఖాయం. మూడు గంటల నిడివి ఉన్న సినిమా బాగుంది. ప్రభాస్ నిండుగా ఉన్నాడు..భావాలు పలక లేదు. స్వరం అతక లేదు. సైఫ్ అలీ ఖాన్ పెద్దగా చేసింది ఏమీ లేదు. కృతి సనన్ అందంగా ఉంది. ఇరగదీసే సీన్స్ నటులకు లేవు. కేవలం యుద్ద కాండ, అరణ్య కాండ మాత్రమే కావడంతో భావోద్వేగాలకు చోటు లేకుండా పోయింది. యుద్ద కాండ విజువల్ వండర్ గా కాకుండా హరీ పొట్టర్ సినిమాను తలపించింది. ఇందులో కొత్తదనం ఉందంటే అది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే. రామానంద్ సాగర్ రామాయణాన్ని టీవీలకు పూజలు చేస్తూ చూసిన మనవాళ్ళు…అది పురుష్ ను ఎలా స్వీకరిస్తారో చూడాలి. అయితే రాముడు, లేకుంటే దేశ భక్తి…పాన్ ఇండియా లెవల్ హిట్ అవుతున్నవి ఇవే. నేషనల్ ఇంట్రస్ట్ ఉంది కాబట్టి.. అది పురుష్ కు కూడా అదే వర్తిస్తుందేమో చూడాలి.