Pawan Kalyan next film: ‘ఓజీ'(They Call Him OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి, వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ పాటకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే, ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమా ఏంటి?. చాలా మంది ఓజీ సీక్వెల్ చేయబోతున్నాడు అని అన్నారు, కొంతమంది అయితే లోకేష్ కనకరాజ్ చిత్రం లో నటించబోతున్నాడని అన్నారు. ఈ రెండిట్లో ఏది నిజమో, ఏది అబద్దమో అభిమానులు కనిపెట్టలేకపోతున్నారు. అయితే రీసెంట్ గా ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారు అయ్యింది అని.
నిన్ననే ఈ ప్రాజెక్ట్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రామ్ తల్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే ఈయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. వ్యాపార రంగం లో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ తల్లూరి, పవన్ కళ్యాణ్ కి కుటుంబ సభ్యుడు లాంటి వాడు. ఇప్పుడు జనసేన పార్టీ లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి దాదాపుగా రెండేళ్లు అయ్యింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే రీసెంట్ గానే సురేందర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి పవన్ కళ్యాణ్ కి వినిపించడం, ఆయనకు తెగ నచ్చడం తో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.
ఇది కూడా ఓజీ తరహా లోనే యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైంటైన్ చేస్తున్న లుక్ ఈ సినిమాకు సంబంధించినదేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 2 , ఓజీ 3 చిత్రాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే విద్మగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా, KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ లో తెరకెక్కే సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడట.