Tollywood Industry 2021: తెలుగు చిత్రపరిశ్రమను ఈ ఏడాది చాలా వివాదాలు చుట్టుముట్టాయి. 2021 ప్రారంభంలో సినిమా షూటింగులు లేక చాలా మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీరా సెప్టెంబర్ మాసం నుంచి సినిమా షూటింగులు ప్రారంభమై అగ్రహీరోల సినిమాలు థియేటర్ల ముందుకు వచ్చాయి. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పవన్ నటించిన వకీల్ సాబ్, బాలయ్య చేసిన అఖండ, నాని హీరోగా వచ్చిన శ్యాంసింగరాయ్, అల్లుఅర్జున్ పుష్పరాజ్‌గా కనిపించిన పుష్ప ది రైజ్ మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ములేపాయి. ఇకపోతే ఈ ఏడాది చివరలో చిత్ర పరిశ్రమల చాలా ఒడిదుడుకులకు గురైంది.
ముందుగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ షూటింగ్‌లో భాగంగా ప్రమాదానికి గురయ్యాడు. బైక్ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో మెగా కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత వచ్చిన మా ఎలక్షన్‌తో సినీ పరిశ్రమ రెండుగా విభజించబడిందని వార్తలు వైరల్ అయ్యాయి. మెగా కుటుంబం నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు సపోర్టు చేయగా, నందమూరి కుటుంబం మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్టు చేశాడు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. అయితే, ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపించడమే కాకుండా గెలిచిన సభ్యులు రాజీనామాలు చేశారు.
Also Read: సరికొత్త ఆశలు, ఆశయాలు… 2022 సమంత టార్గెట్స్ ఏమిటీ?
ఆ తర్వాత ఏపీలో ఆన్‌లైన్ టికెట్లు, ధరల తగ్గింపు విషయమై రచ్చ నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయడంతో నటుడు పోసాని కృష్ణమురళి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఫ్యాన్స్ అతని ఇంటిపై రాళ్లు రువ్వారు. ఏపీలో టికెట్ ధరలపై యాక్టర్ నాని కూడా స్పందించారు. 5రూపాయలుగా సినిమా టికెట్ ధరను నిర్ణయించడంపై థియేటర్ల కంటే కిరాణా కొట్టోడికి లాభాలు వస్తాయని నాని కామెంట్స్ చేయడంతో ఆయన్ను ఏపీ మంత్రులు టార్గెట్ చేశారు. మీరు ప్రజల సొమ్మును కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నారు. వారికి బెనిఫిట్ చేస్తే మీకు నొప్పి కలుగుతుందా? అంటూ పేర్నీ నాని ఫైర్ అయ్యారు. ఇకపోతే ఈ ఏడాది టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ సామ్ చై విడాకులు తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. వారిద్దరూ విడాకులు తీసుకుని నెలలు గడుస్తున్నా నేటికి హాట్ టాపిక్‌గా మారింది.