Uber Cabs: ముంబయిలోని వినియోగదారుల ఫోరం ఉబర్ క్యాబ్ సంస్థకు రూ.20 వేలు జరిమానా విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్నా సమయానికి గమ్యం చేర్చడంలో విఫలం కావడంతో బాధితురాలు కవితా శర్మ వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించింది. దీంతో వినియోగదారుల ఫోరం ఈమేరకు ఉబర్ క్యాబ్ కు అక్షింతలు వేసింది. క్యాబ్ వల్ల తనకు జరిగిన ఆలస్యంతో తాను నష్టపోయానని ఆమె ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన ఫోరం క్యాబ్ కు ఫైన్ విధించింది. దాదాపు 15-20 నిమిషాల ఆలస్యంతో తాను వెళ్లాల్సిన విమానాన్ని అందుకోలేకపోయానని ఆమె ఫిర్యాదులో పేర్కొనడంతో ఫోరం స్పందించింది.

ముంబయికి చెందిన న్యాయవాది కవిత శర్మ 2018 జూన్ 12న చెన్నైకి వెళ్లేందుకు విమానం ఎక్కాలని టికెట్ బుక్ చేసుకుంది. దీంతో విమానాశ్రయం చేరుకోవడానికి మధ్యాహ్నం 3.29 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది. యాప్ లో సూచించిన దానికంటే క్యాబ్ 14 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఇంకా డ్రైవర్ పలుమార్లు కాల్ చేసినా ఆలస్యంగానే వచ్చాడు. ప్రయాణంలో కూడా పలుమార్లు ఫోన్ మాట్లాడుతూ నెమ్మదిగా వెళ్లడంతో చేరుకోవాల్సిన విమానం వెళ్లిపోయింది. దీంతో మరో విమానంలో ఆమె ప్రయాణించాల్సి వచ్చింది.
వెళ్లాల్సిన మార్గంలో సరిగా వెళ్లకుండా వేరే దారిలో వెళ్లడంతో ఆలస్యానికి కారణమైంది. ఈ నేపథ్యంలో 15-20 నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయింది. మరో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆలస్యానికి కారణం ఉబర్ క్యాబ్ అని ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేయించింది. యాప్ బుక్ చేసుకున్న సమయంలో కారు ఖరీదు రూ.563 చూపించినా ఉబర్ రూ. 703 బిల్లు వేసింది. దీనిపై కూడా ఫిర్యాదు చేయగా తర్వాత రూ.139 తిరిగి ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

తొలుత ఉబర్ కంపెనీకి న్యాయపరమైన నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోవడంతో ఆమె థానే జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ను ఆశ్రయించింది. దీంతో ఫోరం ఉబర్ యాజమాన్యానికి రూ.20 వేలు జరిమానా విధించింది. కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు, మానసికంగా వేదనకు గురి చేసినందుకు గాను మరో రూ.10 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. వినియోగదారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన ఉబర్ యాజమాన్యంపై ఫోరం అక్షింతలు వేసి ఫైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.