
Bala Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణలో ఒకే కోణం తెలుసు చాలా మందికి. ఎక్కడ తప్పు జరిగినా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారు. అయితే.. పైకి కరకుగా కనిపించే బాలయ్య మనసు మాత్రం వెన్న వంటిదని చాలా తక్కువ మందికే తెలుసు. ఇదే విషయాన్ని మరోసారి చాటిచెప్పారు బాలయ్య. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి చేయూతనిచ్చి.. గొప్ప మనసును చాటుకున్నారు.
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరికి చెందిన చిన్నారి మణిశ్రీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. బాలయ్య ఆధ్వర్యంలో నడిచే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే.. మణిశ్రీ చికిత్స కోసం 7 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే.. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో.. అంత మొత్తం చెల్లించడం భారమైంది. దాతలను సహాయం కోరినప్పటికీ.. కేవలం లక్షా 80 వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి.
దీంతో.. చిన్నారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీంతో సదరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాలకృష్ణ.. చిన్నారి ఆపరేషన్ కు చెల్లించాల్సిన 5 లక్షల 20 వేల రూపాయలను మాఫీ చేయించారు.
అంతేకాకుండా.. సదరు చిన్నారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బాలయ్య వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ చిన్నారిని ఆదుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. బాలయ్య మంచి మనసు గురించి తెలుసుకున్న వారంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఇక, సినిమాల గురించి చూస్తే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు దర్శకుడు గోపీచంద్ తోనూ ఓ సినిమా ఫైనల్ చేశారు బాలయ్య. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటసింహం డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నారు.