
Love Story : నాగచైతన్య-సాయిపల్లవి జంటగా.. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడింది. ఓటీటీలో వదిలేస్తారనే ప్రచారం సాగినప్పటికీ.. థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రం అందరికీ షాకిస్తోంది.
ఫిదా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబో అనగానే ఒక విధమైన క్రేజ్ ఏర్పడిందీ చిత్రానికి. సినిమా ప్రమోషన్స్ కూడా బాగుండడం.. సారంగ ధరియా పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. అయితే.. వకీల్ సాబ్ తర్వాత థియేటర్లను తాకాల్సిన నెక్స్ట్ సినిమా ఇదే. కానీ.. కరోనా విజృంభించడంతో.. అనివార్యంగా థియేటర్లు మూతపడడంతో సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి.
ఎట్టకేలకు ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయితే.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అందరూ అవాక్కైపోతున్నారు. ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఏకంగా ఈ సినిమా 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. శేఖర్ కమ్ముల టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేశారని సమాచారం.
ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. నైజాం హక్కులు 11 కోట్లు పలికినట్టు సమాచారం. ఓవర్సీస్ లోనూ భారీ ధరకే సినిమాను కొనుగోలు చేసినట్టు సమాచారం. మిగిలిన శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి 50 కోట్లు మేర బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్. మరి, ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది అన్నది చూడాలి.