Krishnam Raju : సీనియర్ నటుడు, ప్రభాస్(Prabhas) పెదనాన్న కృష్ణం రాజు(Krishnam Raju) ఇవాళ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాలుజారి పడిపోయారని, దీంతో ఆయన తుంటి ఎముక దెబ్బ తిన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. నిన్న సాయంత్రం ఇది జరిగిందని, వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో కోలుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. కృష్ణం రాజు కార్యాలయం మాత్రం మరో ప్రకటన వెల్లడించింది.
ఆయన కేవలం రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే అపోలో ఆసుపత్రి(Apollo Hospital)కి వెళ్లారని ఆయన ఆఫీసు నుంచి మీడియా ప్రకటన వెలువడింది. త్వరలో బ్రిటన్ వెళ్లాల్సి ఉన్నందున రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే దవాఖానాకు వెళ్లినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి, కుటుంబ సభ్యులతో చర్చించినట్టు ఆయన ప్రకటనలో తెలిపారు.
గతంలో కృష్ణం రాజు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మరోసారి అపోలో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు రావడంతో ప్రభాస్, కృష్ణం రాజు ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే.. కృష్ణం రాజు కార్యాలయం విడుదల చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణం రాజు.. రెబల్ స్టార్ గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో 183 సినిమాల్లో నటించిన కృష్ణం రాజు.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం, భక్తకన్నప్ప, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కృష్ణం రాజు ఖాతాలో ఉన్నాయి. చిలకా గోరింక చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కృష్ణంరాజు.. మూడు నందులతోపాటు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.