సినిమాల్లోని సన్నివేశాలను బుల్లితెరపై స్పూఫ్ చేయడం కామన్. సినిమా నటులను ఇమిటేట్ చేయడం కూడా సాధారణమే. కానీ.. బుల్లితెర కాన్సెప్ట్ ను సినిమాల్లో స్పూఫ్ చేస్తే..? టీవీ నటుడిని సీనియర్ యాక్టర్ ఇమిటేట్ చేస్తే? అది ఖచ్చితంగా ప్రత్యేకమే. ఆ క్రెడిట్ గెటప్ శ్రీనుకు దక్కబోతోంది! జబర్దస్త్ కామెడీ షోలో అతను పోషించిన ఓ పాత్రను.. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ‘పెళ్లిసందD’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం.
ఈ చిత్రంలో బ్రహ్మానందం మంచి కామెడీ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన ‘జాతి రత్నాలు’ సినిమాలో కాసేపే కనిపించినా.. బ్రహ్మీ పూయించిన నవ్వులు అందరినీ అలరించాయి. ఇప్పుడు ‘పెళ్లిసందD’ సినిమాలో కూడా చిన్న పాత్రల్లో బ్రహ్మానందం నటించబోతున్నట్టు సమాచారం.
ఈ క్యారెక్టర్లోనే గెటప్ శ్రీను స్పూఫ్ చేయబోతున్నట్టు సమాచారం. జబర్దస్త్ లో గెటప్ శ్రీను పోషించిన పాత్రల్లో ‘బిల్డప్ బాబాయ్’ ఒకటి. ఈ పాత్రలో వెరైటీ మేనరిజం ప్రదర్శిస్తూ.. భారీ గొప్పలు చెప్పుకుంటాడు శ్రీను. అయితే.. పక్కనున్నవాళ్లు అనుమానంగా చూడడంతో.. ‘నమ్మరేంట్రా బాబూ..’ అంటూ దీర్ఘం తీస్తాడు. డైలాగ్ డెలివరీ, మేనరిజం అద్భుతంగా క్లిక్ కావడంతో.. నవ్వులు పూశాయి.
ఇప్పుడు.. ఇదే స్పూఫ్ ను బ్రహ్మానందం చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తికావొచ్చింది. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? బ్రహ్మీ స్పూఫ్ ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి.