Parliament Elections 2024 : ప్రచారం కోసం షారుఖ్ ఖాన్ రాలేదు.. ఇలా వాడేశారు

ప్రజల మనసు గెలిచే దమ్ము లేక ఇలా సినీ నటులతో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ షారుక్ ఖాన్ డూప్ ఎన్నికల ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ప్రచారం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Written By: NARESH, Updated On : April 19, 2024 10:40 pm

Shah Rukh Khan

Follow us on

Parliament Elections 2024 : మనదేశంలో సినీ నటులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు ఏదో ఒక తీరుగా సినీ నటులతో ప్రచారాన్ని సాగిస్తాయి. మనదేశంలో 90వ దశకంలో సినీ నటులు రాజకీయ పార్టీల ప్రచారానికి నాంది పలికారు.. అది ఎన్నికల జరిగిన ప్రతి సారీ రెట్టింపవుకుంటూ వస్తుంది. మొదట్లో ఉత్తరాదిలో ప్రారంభమైన ఈ సాంప్రదాయం క్రమంగా దక్షిణాది ప్రాంతానికి విస్తరించింది. అయితే ఉత్తరాది ప్రాంతంతో పోల్చితే దక్షిణాది ప్రాంతంలోనే సినీ రంగానికి చెందినవారు ముఖ్యమంత్రులైన చరిత్ర ఉంది. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులు కాగా, తెలుగు నాట ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు. పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై పరిపాలనలో తనదైన మార్క్ ప్రదర్శించి ఆంధ్రుల ” అన్న” గా సుపరిచితులయ్యారు.

ఇక ఉత్తర భారత దేశంలో అయితే సినీ నటులు రాజకీయాల్లో తమదైన మార్క్ ప్రదర్శించినప్పటికీ.. కీలక పదవులను మాత్రం అధిష్టించలేకపోయారు. రాజకీయ పార్టీల అవసరాలకు మేరకు మాత్రమే వారు తమ పాత్రను పోషించేవారు. అయితే ఎమ్మెల్యేలు, లేకుంటే పార్లమెంటు సభ్యులు, గట్టి ప్రాబల్యం ఉంటే మంత్రులు.. ఇంతవరకే పరిమితం అయిపోయారు.. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సినీ తారలు ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఒకరు. అదేంటి ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని? అనుకుంటున్నారు కదూ.. కానీ నిజంగానే షారుఖ్ ఖాన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.. పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలు కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మహారాష్ట్రలో షారుక్ ఖాన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాకపోతే అతను నిజమైన షారుక్ ఖాన్ కాదు. ఆయన డూప్.

వాస్తవానికి షారుఖ్ ఖాన్ గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారట. కానీ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అయితే షారుఖ్ ఖాన్ మహారాష్ట్ర వాసి కావడంతో.. అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన డూప్ తో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాలలో షారుక్ ఖాన్ డూప్ తో ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథం ద్వారా క్యాంపెయిన్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల మనసు గెలిచే దమ్ము లేక ఇలా సినీ నటులతో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ షారుక్ ఖాన్ డూప్ ఎన్నికల ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ప్రచారం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.