Ap Assembly Election Result 2024 : ఆంధ్రప్రదేశ్ లో కూటమి సునామీ సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీని మట్టి కరిపించాయి. ఐదేళ్లు చేసిన పాలనను ప్రజలు ఇష్టపడలేకపోయారు. దీంతో గంప గుత్తగా కూటమికే ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల వరకే కూటమి దాదాపు 155 స్థానాల్లో లీడ్ కనిపించింది. దీంతో గెలుపు పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ కనీస ఓట్లు కూడా సాధించలేకపోతుంది. ఒకటి, రెండు కాదు కనీసం 20 స్థానాల్లో కూడా లీడ్ కనిపించకపోవడం గమనార్హం. దీంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అన్న చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి వరకు వైసీపీ చేసిన ప్రచారంలో 100కు పైగానే సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ మేజిక్ ఫిగర్ దాటకపోగా ప్రతికపక్ష హోదా లభించే సీట్లలో కూడా గెలిచే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లలో గెలుపొందాలి. కానీ 15 వరకు కూడా లీడ్ స్థానంలోకి రావడం లేదు. లీడ్ లోనే ఈ ఫిగర్ ఉంటే గెలుపు ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది.
మరోవైపు కూటమికి ఎదురులేని విజయం దక్కినందుకు ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఒకే స్థానంలో గెలుపొందిన జనసేన ఈసారి పోటీ చేసిన 21 స్థానల్లో 20ల్లో ఆధిక్యం కొనసాగింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ 60 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమేనన్న ప్రచారం సాగుతోంది. గతంలో కంటే ఇప్పుడు జనసేన పుంజుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా 7 స్థానాల్లో ముందుండడం విశేషం.