AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గం కూర్పు దాదాపుగా ఖాయమయ్యిందా? ఈసారి వచ్చేది ఎన్నికల క్యాబినేటా? ఇటీవల దూరమైన కొన్ని సామాజికవర్గాలను మచ్చిక చేసే ప్రయత్నం చేస్తున్నారా? అందుకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు జరుగుతుందా? అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామక్రిష్టారెడ్డి వ్యాఖ్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
ఆయన మాటలను చూస్తే కొన్ని ప్రధాన సామాజికవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత దక్కబోతోందని తెలుస్తోంది.ఏపీలో ఎస్సీ,ఎస్టీ బీసీలకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో అగ్ర తాంబూలం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలు ఎక్కువే. దాదాపు మూడో వంతు వారే ఉన్నారు. ఆది నుంచి వైసీపీని ఆదరిస్తున్న ఎస్సీలకు కేబినెట్లో సముచిత స్థానమే కల్పించారు. అయితే ఈసారి వారికి అధికంగా మంత్రి పదవులు కేటాయించడం ద్వారా వారి మద్దతును పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు. ఏపీలో కులాల సంకుల పోరాటంగా రాజకీయాలు మారుతున్న క్రమంలో ఏ అవకాశమూ జారవిడిచుకోకుండా జాగ్రత్త పడుతోంది.
Also Read: AP Cabinet Reshuffle 2022: త్వరలోనే జగన్ బుజ్జగింపులు.. మాట వింటారా.. మర్లబడతారా..?
ఇందుకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పును చేస్తోంది. రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. గణాంకాలు సైతం ఇవే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.. నిజంగా బీసీ కుల గణన జరిగితే ఆ విషయం నిజమే అని తేలే అవకాశం ఉంది. దాంతో మొత్తం మంత్రులలో కనీసం పది మంది దాకా బీసీల నుంచి వస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో ఎనిమిది మంది దాకా ఉన్న ఈ సంఖ్య అలా పెరుగుతుంది అని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకూ రాష్ట్రంలో బీసీ సామాజికవర్గాలు తెలుగుదేశం గొడుగు కిందే ఉన్నాయి. గత ఎన్నికల్లో వరాల జల్లు కురిపించడంతో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో కొన్ని బీసీ వర్గాలు వైసీపీకి దూరమయ్యాయి. అందుకే మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యమివ్వడంతో పాటు రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్సీలకు అరడజను పదవులు
ఎస్సీలకు కూడా గతసారి అయిదు దాకా మంత్రి పదవులు దక్కాయి ఇపుడు మంత్రివర్గ విస్తరణలో అరడజనుకు తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట నడిచింది ఎస్సీలే. దాదాపు ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకే మరలింది. గత రెండు సాధారణ ఎన్నికల్లో ఎస్సీలు వైసీపీనే ఆదరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సైతం ఆ పార్టీకి ఎస్సీ ఎమ్మెల్యేలు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అయితే ఎస్సీలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అంటూ ఏవీ లేకపోవడం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సైతం పక్కదారి పట్టడం తదితర కారణాలతో ఎస్సీలు వైసీపీకి కొంతవరకూ దూరమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది కూడా గ్యాప్ నకు కారణమైంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా మంత్రివర్గ విస్తరణలో వారికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. కొత్త కేబినెట్లో వారికి సముచిత స్థానం కల్పించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని జగన్ భావిస్తున్నారు. ఎస్టీలది అదే పరిస్థితి. దాదాపు ఎస్టీ ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఎస్టీ ఎమ్మేల్యే అయినా పాముల పుష్ప శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పడు మంత్రివర్గ కూర్పులో కూడా వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
భళా..సోషల్ ఇంజనీరింగ్
మైనారిటీలకు ఒకటి , కమ్మలకు ఒకటి ఇలా లెక్క తీసుకుంటే అక్కడికే 19 దాకా కొత్త మంత్రులు ఉంటారని అంటున్నారు. మరి మిగిలిన అయిదింటిలోనే అంతా సర్దుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈసారి అగ్ర వర్ణాల నుంచి బాగా కుదింపు ఉండవచ్చు అని సంకేతాలు అయితే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గంతో పాటు దళిత గిరిజన మైనారిటీ వర్గాలను తమ వైపునకు తిప్పుకోవాలన్న వైసీపీ ఆలోచనల మేరకే కొత్త మంత్రివర్గం కూర్పు ఉండవచ్చు అని తెలుస్తోంది. ఆది నుంచి ఈ తరహా సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో జగన్ కి విశేష అనుభవం ఉంది. ఇప్పటికి చాలా సార్లు సక్సెస్ ఫుల్ గా అమలు చేసి చూపించారు. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, సోషల్ ఇంజనీరింగ్ తో గత ఎన్నికల్లో విజయం సాధించారు. అదే వ్యూహానికి ప్రస్తుతం మెరికలు దిద్దుతున్నారు. కానీ అగ్రవర్ణాలు, ఆపై తన సొంత సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదును జగన్ ఎదుర్కొంటున్నారు. కులాల కుంపట్లు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థుతుల్లో కొత్త కేబినెట్ ప్రయోగం ఎటు దారి తీస్తుందోనన్న భయం సగటు వైసీపీ నాయకుడిలో ఉంది.
Also Read:Amaravati Capital Issue: అమరావతిపై మడత పేచీ.. వైసీపీ ప్రభుత్వం కొత్త పల్లవి
Web Title: Election team ready completed cabinet composition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com