https://oktelugu.com/

TS EAMCET-2023: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె.. నేటి నుంచి స్లాట్‌ బుకింగ్‌

రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్‌ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలను చేర్చరు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 26, 2023 / 12:13 PM IST

    TS EAMCET-2023

    Follow us on

    TS EAMCET-2023: తెలంగాణలో ఎంసెట్‌–2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు సోమవారం నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ సూచించారు. ఈనెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రవేశాలు, కోర్సులు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్‌ ప్రక్రియ, నోటిఫికేషన్, సహాయ కేంద్రాల సమాచారాన్ని https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని కన్వీనర్‌ తెలిపారు.

    కాలేజీలు, సీట్ల వివరాలపై గందరగోళం.. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతున్నా ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌ లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విభాగానికి అందలేదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం దాదాపు 145 కాలేజీలు పాల్గొంటాయి. వాటికి సంబంధించిన వివరాలను యూనివర్సిటీలు ఎంసెట్‌ కౌన్సిల్‌కు పంపాల్సి ఉంటుంది. వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు ఉంటాయో? వివరాలు అందించాలి. దీని ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ఏడాది కూడా దాదాపు 100 కాలేజీలు బ్రాంచీల మార్పు కోసం ముందుకొ చ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంబంధిత కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మౌలికవసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపుతోపాటు సీట్ల మార్పిడిని పరిశీలిస్తామని చెప్పారు.

    1.05 లక్షల సీట్లు..
    రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. తొలిదశలో సాధారణంగా 75 వేల సీట్లను కౌన్సెలింగ్లో ఉంచుతారు. కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్‌ పూర్తవ్వకపోవడం, మౌలికవసతులు, ఫ్యాకల్టీ సమకూర్చుకొనేందుకు ఆయా కాలేజీలకు మరికొంత అవకాశం ఇవ్వడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలను చేర్చరు. అయితే ఈసారి పెద్ద మొత్తంలో కాలేజీల జాబితా అందలేదని అధికారులు చెబుతున్నారు. వాటిని రెండో విడతలో చేర్చ డం వల్ల కొందరు విద్యార్థులకు నష్టం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.

    పాలిటెక్నిక్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి
    తెలంగాణలో 2023–24 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు 21,367 సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కళాశాలల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సైబర్‌ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి మొత్తం సీట్లు భర్తీ కాగా, జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులే చేరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా 1,673; ప్రెవేటు కళాశాలల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయని పాలిసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎన్ సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌ అనంతరం కేటాయిస్తామని సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.