
తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమ పిల్లలు జీవితంలో గొప్పగొప్ప విజయాలు సాధించాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. వాళ్ల సక్సెస్ కోసం జీవితంలో ఎన్నో కోరికలను, ఇష్టాలను త్యాగం చేస్తూ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తాజాగా ఒక తండ్రి తన కొడుకు పరీక్ష రాయడం కోసం 105 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని థార్ జిల్లా తనవార్ తహసీల్ లోని బేడీపూర్ అనే గ్రామంలో 38 ఏళ్ల శోభ్రామ్ నిరక్షరాస్యుడు. తాను చదువుకోకపోయినా తన కుమారుడు ఉన్నత చదువులు చదవాలని శోభ్రామ్ భావించాడు. తన కుమారుడు సకాలంలో పరీక్షకు హాజరు కావాలనే ఉద్దేశంతో 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. మధ్యప్రదేశ్ సర్కార్ తొలి ప్రయత్నంలో పాస్ కాని విద్యార్థుల కోసం రుక్ జానా నహీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తోంది.
పరీక్ష తన గ్రామం నుంచి 105 కిలోమీటర్ల దూరంలో జరుగుతుండటం, లాక్ డౌన్ వల్ల బస్సులు తిరగకపోవడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయడానికి సరిపడేంత డబ్బు లేకపోవడంతో కుమారుడిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకుని రెండు రోజులు కష్టపడి సైకిల్ పై పరీక్ష కేంద్రానికి చేరాడు. రెండు రోజులకు తనకు, కుమారునికి సరిపడా ఆహారం, నీళ్లను వెంట తీసుకెళ్లాడు. శోభ్రామ్ కుమారుడు అశిశ్ మాట్లాడుతూ తాను పదో తరగతి చదువుతున్నానని, సైకిల్ పై 105 కి.మీ ప్రయాణం చేసి పరీక్ష కేంద్రానికి చేరుకున్నానని చెప్పారు. శోభ్రామ్ మాట్లాడుతూ చదువు లేక తాను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని… తన కొడుకు అలా కాకూడదనే ఉద్దేశంతో పరీక్షలకు తీసుకొచ్చానని చెప్పారు.