Schools Fees In Hyderabad: తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు మంచి పాఠశాలల్లో చదువు చెప్పించాలని కోరుకుంటారు. ఇందుకోసం కష్టపడుతుంటారు. చిన్నప్పటి నుంచే నాణ్యమైన విద్య అందితే వారి భవిష్యత్ బాగుంటుందని ఆశిస్తారు. అందుకే ఆస్తులు కూడబెట్టడం కన్నా.. పిల్లాలను చదివించేందుకే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడతారు. పిల్లలను బెస్ట్ స్కూల్స్‌లో చేర్పించాలని చూస్తారు.
బలహీనతే పెట్టుబడిగా..
పిల్లలకు మంచి పాఠశాలల్లో చదువు చెప్పించాలన్న తల్లిదండ్రుల బలహీనతే కార్పొరేట్ పాఠశాలలకు పెట్టుబడిగా మారుతోంది. తల్లిదండ్రుల కోరికను పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే కొన్ని పాఠశాలలు సీటు రిజర్వు చేస్తున్నాయి. ఇక ఫీజుల విషయానికి వస్తే ఏబీసీడీలు నేర్పించేందుకు లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజులు చూసి తల్లిదండ్రులను బెంబేలెత్తిపోతున్నారు. ఓ స్కూల్ నర్సిరీ ఫీజు ఏకంగా రూ.1.20,000గా నిర్ణయించింది. ఈ విషయాన్ని చెబుతూ ఓ పిల్లాడి తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఇష్టానుసారం ఫీజుల పెంపు..
విద్య ఇప్పటికే వ్యాపారంగా మారింది. కార్పొరేట్ పాఠశాలల పేరుతో హంగులు, ఆర్భాటాలు చూపుతూ ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయి. పెరుగుతున్న స్కూల్ ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్తు పరిగెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీలో జాయిన్ అవుతున్న పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చినంత పనైంది.
50 శాతం పెంపు..
కొత్త విద్యా సంవత్సరంలో ప్రస్తుం ఉన్న ఫీజులను 50 శాతం పెంచాలని పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయని తల్లిదండ్రుల పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని ఎండగడుతున్నారు. 2023 విద్యా సంవత్సరంలో సదరు విద్యాసంస్థలో రూ.2.3 లక్షలుగా ఉన్న ఫీజులు, 2024 ఏడాదికి రూ.3.7 లక్షలకు పెంచారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఫీజుల పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు. ఐబీ కరిక్యులమ్ మారడమే ఇందుకు కారణంగా పేర్కొన్నట్లు పేరెంట్స్ చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్..
హైదరాబాద్ గండిపేటలోని ఓ కార్పొరేట్ పాఠశాల వసూలు చేస్తున్న ఫీజుల గురించి ఓ విద్యార్థి తండ్రి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కొడుకును పాఠశాలలో చేర్పించేందుకు వెళితే యాజమాన్యం నర్సరీకి ఏడాది ఫీజు రూ.1.20 లక్షలు అని తెలిపి షాక్ ఇచ్చిందని పేర్కొన్నాడు. గతేడాది ఫీజులో 50 శాతం పెంచామని యాజమాన్యం తెలిపిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పేరెంట్స్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్కూల్ యాజమాన్యం ఫీజులు పెంచిందని పేర్కొన్నాడు. ఈ పోస్టుపై మరో విద్యార్థి తండ్రి స్పందించాడు. తమ బాబు ఫీజు నర్సరీ నుంచి 1వ తరగతి వరకు ఒకే విధంగా ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ, నర్సరీ నుంచి ఎల్‌కేజీకి వచ్చే సరికే పాఠశాల యాజమాన్యం భారీగా ఫీజు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పాఠశాలను మార్చాలని భావించినా.. ఇంత తక్కువ సమయంలో స్కూల్‌లో అడ్మిషన్లు దొరకడం కష్టతరంగా మారిందని వాపోయారు. ఈ పోస్టు వైరల్ అయింది.