NEET Counselling 2024 Result: నీట్ యూజీ–2024 ప్రవేశ పరీక్ష ఈ ఏడాది పెను సంచలనాలకు కేంద్రమైంది. ఫలితాలను సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం, ఒకే రాష్ట్రం, ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడం అనేక అనుమానాలకు తావించింది. దీంతో కొంతమంది విద్యార్థులు సుప్రీ కోర్టును ఆశ్రయించారు. చాలా మంది నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే సుప్రీం కోర్టు ఆచితూచి విచారణ జరిపింది. దాదాపు నెల రోజుల విచారణ తర్వాత నీట్ పరీక్ష రద్దు చేయడం లేదని ప్రకటించింది. సవరించిన ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. దీంతో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) ఆగస్టు 14న మొదటి విడత కౌన్సెలింగ్ రాష్ట్రాల వారీగా చేపట్టింది. ఆగస్టు 25న తొలి విడత ఫలితాలను విడుదల చేసింది.
ర్యాంకు, ప్రాధాన్యతల ప్రకారం సీట్లు..
ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ– 2024 తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించింది. ఈ కౌన్సెలింగ్లో మొత్తం 26,109 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సాధించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది. రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్కు కాల్ చేసి తెలుసుకోవాలని పేర్కొంది. జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.
ఆగస్టు 29 వరకు రిపోర్టింగ్ గడువు..
ఇదిలా ఉంటే తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29 నాటికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. ఆ తర్వాత రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రక్రియను ఎంసీసీ చేపడుతుంది. మొదటి విడతలాగానే రెండో విడత కూడా కౌన్సెలింగ్ నిర్వహించి ర్యాంకులు, ప్రాధాన్యతల ప్రకారం సీట్లు అలాట్ చేస్తుంది.