భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని, ఆర్థిక స్థితిగతులను, ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఇంటి నుంచి ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గని నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారానే ఉద్యోగులు పని చేసే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.
మారుతున్న పరిస్థితుల నేపథ్యం ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాప్‌జెమినీ గ్రామీణ మహిళలకు శుభవార్త చెప్పింది. అర్హులైన 500 మంది గ్రామీణ మహిళలను సఖి దృష్టికోణ్ అనే ప్రోగ్రామ్ ద్వారా కంపెనీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. దేశంలోని గ్రామీణ మహిళా సాధికారత కోసం కాప్‌జెమినీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కాప్‌జెమినీ ఇప్పటికే దక్షిణాది రాష్టాల నుంచి 100 మందిని నియమించుకున్నామని.. నియమించుకున్న మహిళలు శిక్షణలో ఉన్నారని తెలిపింది.
ఎంపికైన మహిళలకు కాప్‌జెమినీ కంపెనీ సంవత్సరానికి మూడున్నర లక్షల రూపాయల వార్షిక వేతనం ఇవ్వనుంది. కాప్‌జెమినీ డిగ్రీలు చదివి వివిధ కారణాల వల్ల గ్రామాల్లోనే జీవనం సాగిస్తున్న మహిళలకు ప్రయోజనం చేకూర్చడం కోసం సఖి దృష్టికోణ్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన గ్రామీణ మహిళలు సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్, క్లౌడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ విభాగాల్లో పని చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం దేశంలోని కాప్‌జెమినీ కార్యాలయాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. కాప్‌జెమినీ గ్లోబల్ డెలివరీ సెంటర్ హెడ్ రాధిక మాట్లాడుతూ కరోనా విజృంభించిన సమయంలో టెలీకాం, ఇతర మౌలిక వసతులు ఉంటే ఉద్యోగులు దేశంలో ఎక్కడినుంచైనా పని చేయొచ్చని అర్థమైందని.. అందువల్లే అర్హులైన గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు కల్పించాలని అనుకున్నామని తెలిపారు.