https://oktelugu.com/

IT Jobs: ఐటీ కల చెదురుతోంది.. నెక్ట్స్‌ ఏంటి?

సంక్షోభం నేపథ్యంలో ఐటీ ఉద్యోగాల నియామకాల విషయంలో దిగ్గజ కంపెనీలు కూడా వెనుకాడుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌లో నియామకాలు భారీగా తగ్గాయి. 2021–22లో ఈ మూడు కంపెనీలు 1.97 లక్షల మంది నియమించుకోగా.. 2022–23లో ఈ సంఖ్య 68,886కు పరిమితమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 26, 2023 / 06:16 PM IST

    Close up shot of a young software developer, programmer working at his desk

    Follow us on

    IT Jobs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీరంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా లేనంతగా దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో వేల మంది టెకీలు రోడ్డున పడ్డారు. మరోవైపు నియామకాలు కూడా నిలిచిపోయాయి. గతేడాది నియామకాల్లో 65 శాతం క్షీణత కనిపించింది. దీంతో వేలాది మంది ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారు.

    దిగ్గజ కంపెనీలూ నియామకాలకు వెనుకంజ..
    సంక్షోభం నేపథ్యంలో ఐటీ ఉద్యోగాల నియామకాల విషయంలో దిగ్గజ కంపెనీలు కూడా వెనుకాడుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌లో నియామకాలు భారీగా తగ్గాయి. 2021–22లో ఈ మూడు కంపెనీలు 1.97 లక్షల మంది నియమించుకోగా.. 2022–23లో ఈ సంఖ్య 68,886కు పరిమితమైంది. దీంతో నియామకాలు 65 శాతం క్షీణించాయి. ఐటీ కంపెనీలు నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే నిరుత్సాహకరమైన ఫలితాలు ప్రకటించగా.. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ సంక్షోభం కారణంగా భవిష్యత్‌ అంచనాలను కూడా తగ్గిస్తున్నాయి. నాలుగో త్రైమాసికంలో గిరాకీ తగ్గడం స్పష్టంగా కనిపించింది. దీంతో నియామకాలు కూడా అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 68,257 నుంచి 98.7 శాతం తగ్గి కేవలం 884కు చేరాయి.

    · 2021–22లో టీసీఎస్‌ 1,03,546 ఉద్యోగులను చేర్చుకోగా.. 2022–23లో ఇది 22,600కు తగ్గింది. ఇన్ఫోసిస్‌ నియామకాలు కూడా 54,396 నుంచి 29,219కు తగ్గాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ నియామకాలు 17,067కు పరిమితమయ్యాయి.

    · 2022–23 నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ నియామకాలు 35,209 నుంచి 821కు చేరగా.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు 3611 తగ్గడం గమనార్హం. హెచ్‌సీఎల్‌ టెక్‌ 3,674 ఉద్యోగులను చేర్చుకుంది.

    2023–24లో నియామకాల పరిస్థితి ఇదీ..
    – ఈ ఏడాది ప్రథమార్థంలో గిరాకీ కారణంగా ఉద్యోగులను గణనీయంగా నియమించుకున్నామని, రికార్డు స్థాయిలో 44 వేల మంది ఫ్రెషర్‌లను చేర్చుకున్నట్లు టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ అధికారి మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. 2023–24లో 46 వేల ప్రాంగణ(క్యాంపస్‌) నియామకాలు ఉంటాయని వెల్లడించారు. 2022–23 రెండో త్రైమాసికంలో 21.5 శాతంగా ఉన్న వలసల రేటు.. నాలుగో త్రైమాసికానికి 20.1 శాతానికి తగ్గించగలిగినట్లు పేర్కొన్నారు.

    – ఇక గిరాకీ తగ్గడంతో సామర్థ్యాల వినియోగం 80 శాతానికి తగ్గినట్లు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌ స్పష్టం చేశారు. రాబోయే త్రైమాసికాల్లో ఇది మెరుగుపడితే, ఫ్రెషర్ల నియామకాలు చేపడతామన్నారు. 2022–23లో 51 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్న సంస్థ.. ఈ ఏడాది నియామకాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

    – 2022–23లో రికార్డు స్థాయిలో 25 వేల మందికి పైగా ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకున్న హెచ్‌సీఎల్‌ టెక్‌.. ఈ ఏడాదిలో ఈ సంఖ్యను పెంచడానికి చూస్తున్నట్లు తెలిపింది.