NCERT Textbooks: విద్యార్థులకు అందించే విజ్ఞాన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చే ఎన్‌సీఈఆర్టీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్‌సీఈఆర్టీతో సమావేశమైంది. భారత తాజా పరిశోధనలను పాఠ్యపుస్తకాల్లో భాగం చేసేందుకే ఎన్‌సీఈఆర్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.
ఎన్‌సీఈఆర్టీకి లేఖ..
మరోవైపు భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ తరఫున ఎన్‌సీఈఆర్టీకి లేఖ కూడా రాశారు. అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల చరిత్ర, వాతావరణ మార్పులు ఇతర అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. దీంతో ఎన్‌సీఈఆర్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పరిశోధనలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే పాఠ్యాంశాలు..
ఇదిలా ఉంటే.. అంటార్కిటికా చరిత్ర ఇప్పటికే పాఠ్యాంశంగా ఉంది. అయితే ఆ సమాచారం పాతది కావడంతో తాజా పరిశోధనలతో సమాచారం అందుబాటులో లేదు. దీంతో పాతది తొలగించి కొత్త వివరాలతో పాఠ్యాంశాల్లో చేర్చే అవకాశం ఉంది. అలాగే ఆర్కిటిక్, హిమాలయాల గురించి కూడా తక్కువ సమాచారమే పుస్తకాల్లో ఉంది.
తాజా పరిశోధనల వివరాలు..
కొత్తగా చేర్చే పాఠ్యాంశాలలో తాజా పరిశోధనల వివరాలు ఉంటాయని ఎన్‌సీఈఆర్టీ తెలిపింది. పరిశోధన ఫలితాలను పాఠ్యాంశాల్లో చేర్చే అంశంపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. తర్వాత కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పాఠ్యాంశాలుగా చేర్చే అవకాశం ఉంటుంది.