TS EAMCET: పోటీ పరీక్షలు అనగానే.. చాలా మంది విద్యార్థులు భయపడతారు. సాధారణంగా పరీక్షలు అంటేనే పిల్లల్లో టెన్షన్ మొదలవుతుంది. ఇక పోటీ పరీక్షల అనుభవం కోసం, పరీక్ష ప్యాట్రన్ తెలుసుకోవడం కోసం చాలా మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను పరీక్షలు రాసేలా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాగే ఓ విద్యార్థి పోటీ పరీక్షల అనుభవం వస్తుందనే ఉద్దేశంతో ఎంసెట్ రాశాడు. సరదాగా రాసిన పరీక్షలో.. ఏకంగా రాష్ట్రంలోనే పదో ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపర్చాడు.
హైదరాబాద్ విద్యార్థి..
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన కొల్లాబత్తుల ప్రీతం ఇంటర్ పూర్తిచేశాడు. మెడికల్ సీటు కోసం ఇటీవల నీట్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే ఎంసెట్ కూడా ఉండడంతో ఖాళీగా ఉండడం ఎందుకని, ఎంసెట్ పేపర్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది, పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈమేరకు ఎంసెట్ పరీక్ష ఫీజు కూడా కట్టాడు. నీట్ పరీక్ష జరిగిన వారం రోజుల్లోనే ఎంసెట్ ఉండడంతో దానిని కూడా అటెంప్ట్ చేశాడు.
స్టేట్ లెవల్‌లో టెన్త్ ర్యాంక్..
ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా సరదాగా రాసిన ఎంసెట్‌లో ప్రీతం సిద్ధార్థ ఏకంగా రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ తన అంతిమ లక్ష్యం వైద్య విద్యను అభ్యసించడమేనన్నాడు. ఇతని తండ్రి హర్షవర్ధ¯Œ న్యూరోసర్జ¯Œ , తల్లి శాంతి గైనకాలజిస్టు. దీంతో తాను కూడా వారి బాటలోనే నడవాలనుకుంటున్నానని వెల్లడించాడు. డాక్టర్ కావడం కోసమే నీట్ రాశానని తెలిపాడు. నీట్‌లో కూడా మంచి ర్యాంకు వస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
భయం, ఒత్తిడిని జయిస్తే..
ప్రీతం ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్ష రాయడం వలన ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాడని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు అనగానే ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. భయం, ఒత్తిడి కారణంగానే చదివిన అంశాలను కూడా మర్చిపోతుంటారని వెల్లడించారు. ఒత్తిడి, భయాన్ని జయిస్తే ప్రతీ విద్యార్థి పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకు సాధిస్తాడని పేర్కొంటున్నారు. ఇందుకు తాజాగా ప్రీతం సిద్ధార్థ ర్యాంకే ఉదాహరణ అని చెబుతున్నారు.
Recommended Video: