https://oktelugu.com/

Employee stress : ఐదంకెల జీతం వస్తే చాలా.. మనశ్శాంతి ఉండొద్దా?

కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని, అయితే వారు ఎక్కువ కాలం పని చేయలేరని ఆ సంస్థ చేసిన సర్వేలో తేలింది

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2023 / 09:52 PM IST
    Follow us on

    Employee stress :  ఐదు అంకెల జీతం, విలాసవంతమైన జీవితం, ఖరీదైన విల్లా, లక్షలు విలువ చేసే కారు, చేతిలో లెక్కకు మిక్కిలి డెబిట్ కార్డులు, పర్సులో బరువుగా క్రెడిట్ కార్డులు… వారాంతాల్లో సినిమాలు, రెస్టారెంట్లలో కాంటినెంటల్ రుచులు..ఇలాంటి జీవితాన్నే కదా చాలామంది కోరుకునేది! అయితే ఇది జీవితమే కాదా? ఇలాంటి లైఫ్ అంటే చాలామంది కార్పొరేట్ ఉద్యోగులకు బోర్ కొడుతోందా? డబ్బు చుట్టూ వెంపర్లాడటం ఇబ్బంది పెడుతుందా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వస్తున్నాయి.

    మీరు పిల్ల జమిందార్ అనే సినిమా చూశారా? అందులో నాని బాగా డబ్బున్న కుటుంబంలో పుడతాడు. డబ్బు విపరీతంగా ఖర్చు చేయడం వల్ల దాని విలువ అతడికి తెలియదు. అతడికి కష్టం విలువ ఏంటో తెలియాలని అతడి తండ్రి ఒక మారుమూల గ్రామంలో వదిలిపెడతాడు. అక్కడ నాని అనేక కష్టాలు పడతాడు. చివరికి డబ్బు విలువ ఏంటో తెలుసుకుంటాడు.. అయితే ఇప్పుడు చాలామంది కార్పొరేట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ వారికి అది నచ్చడం లేదు.

    -ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి

    కార్పొరేట్ కొలువు అంటే పైకి ఎంత అందంగా కనిపిస్తుందో.. లోపల అంతకుమించి అనేలాగా ఒత్తిళ్లు ఉంటాయి. యాజమాన్యం నుంచి లక్ష్యాలు ఇక సరే సరి. మరీ ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ఏర్పడబోతోంది అనే వార్తలు వినిపిస్తుండడంతో ఉద్యోగుల్లో ఈ భయాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాదు యాజమాన్యాలు కూడా ఉద్యోగులపై తీవ్ర పనిభారాన్ని మోపుతున్నాయి. రాత్రిళ్ళు కనీసం కంటిమీద కునుకు కూడా ఉండడం లేదు. చివరికి తినే తిండి కూడా మింగుడు పడటం లేదని ఉద్యోగులు అంటుండడం వారి దయనీయ పరిస్థితికి అడ్డం పడుతుంది. అంతేకాదు కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల్లో సగం మందికి పైగా మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    సైలెంట్ స్ట్రగుల్ ఆధ్వర్యంలో

    కార్పొరేట్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పై ది సైలెంట్ స్ట్రగుల్ పేరిట ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎంపవర్ చేపట్టిన సర్వేలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని, అయితే వారు ఎక్కువ కాలం పని చేయలేరని ఆ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఇదే క్రమంలో కార్పొరేట్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడంతో పాటు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కంపెనీలకు ఆ సర్వే సంస్థ సూచనలు చేసింది. ఇక ఈ సర్వేలో భాగంగా దేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె వంటి నగరాల్లో సుమారు 3000 మంది ఉద్యోగులపై సైలెంట్ స్ట్రగుల్ సంస్థ సర్వే నిర్వహించింది. అధ్యయనానికి సంబంధించి ఎంపిక చేసిన వారిలో 1627 మంది పురుషులు, 1373 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 2,640 మంది 30 నుంచి 40 ఐదు సంవత్సరాల మధ్య ఉన్నారు. 291 మంది 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో, 69 మంది 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఉన్నారు.

    48 శాతం

    అయితే ఈ అధ్యయనంలో 48 శాతం మంది ఉద్యోగులు రిస్క్ లో ఉన్నారు. వీరి మానసిక ఆరోగ్యం తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టు తెలిసింది. హెల్త్ రిస్క్ ప్రొఫైల్ పరిశీలించగా 56 శాతం మంది మహిళలు, 41 శాతం మంది పురుషులు ఆ జాబితాలో ఉన్నారు. అయితే అత్యధికంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో 71% రిస్క్ లో ఉన్నారు. ఇక 40 నుంచి 60 ఏళ్ల వారిలో 48 శాతం, 30 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారిలో 47 రిస్క్ ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ఛాయలు ఏర్పడుతున్న నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో వారు తీవ్ర మానసికక్షభకు గురవుతున్నట్టు సర్వేలో తేలింది.