భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకననీ(సీఎంఐఏ) కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ సంస్థ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో లాక్ డౌన్ పూర్వపు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ సంస్థ తెలిపింది.
లాక్ డౌన్ కు పూర్వం ఇండియాలో నిరుద్యోగ రేటు 8.5 శాతం వరకూ ఉండేదని, లాక్ డౌన్ విధించడంతో అది ఏకంగా 40 శాతం వరకూ రీచ్ అయ్యిందని ఈ సంస్థ చెబుతోంది. నగరాల్లో, పట్టణాల్లో భారీగా నిరుద్యోగిత పెరిగిన వైనాన్ని ఆ శాతంతో చెబుతోంది. మే నెలలో అలాంటి పరిస్థితి నెలకొందని వివరించింది. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చేసిందని ఆ సంస్థ చెబుతోంది. జూన్ మూడో వారానికి నిరుద్యోగ రేటు నగరాల్లో 8 శాతానికి చేరుకుందని, ఒక దశలో 27 శాతం ఉండిన నిరుద్యోగ రేటు ఇప్పుడు ఎనిమిది శాతానికి చేరుకుందని ఈ సంస్థ చెబుతోంది. అంటే లాక్ డౌన్ పూర్వంలా నగరాల్లో మళ్లీ ఎవరి పని వారు చేసుకుంటున్నట్టుగా ఈ సంస్థ చెబుతోంది.
ఇంత వరకు వినడానికి బాగానే ఉన్నా.. లాక్ డౌన్ పూర్వ పరిస్థితులు ఏర్పడిపోయానేదే… నమ్మశక్యంగానే ఉందా? ఇంకా అనేక రకాల పరిశ్రమలు పూర్వపు స్థాయిలో పట్టాలెక్కినట్టుగా కనిపించడం లేదు. అయితే ఈ సంస్థ మాత్రం అంతా పూర్వపు స్థితికి వచ్చేసిందని అంటోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ప్రత్యేకించి దిగువ, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న స్థాయి ఉద్యోగులను లాక్ డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడటం, మార్కెటింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ల అవకాశాలూ దెబ్బతినడాన్ని గమనించవచ్చు. ఇక వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఈ విధంగా కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ క్రమంలో దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిందని సీఎంఐఏ కూడా ఒప్పుకుంటోంది.