CBSE Results 2024: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పదో తరగతికి సంబంధించి ఆయా బోర్డులు ఫలితాలను ప్రకటిస్తున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంతవరకు ఫలితాలు ప్రకటించడం లేదు. వాస్తవానికి ఈ బోర్డు పరిధిలో పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరిగాయి. పరీక్షలు ఎప్పుడో ముగిసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు రాకపోవడం పట్ల విద్యార్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈ వార్షిక పరీక్షలు రాశారు. పరీక్షలు రాసి రోజులు గడుస్తున్నప్పటికీ ఫలితాలు రాకపోవడంతో.. విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విభాగాధిపతులను ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల నుంచి ప్రశ్నల పరంపర ఎక్కువ కావడంతో బోర్డు విభాగాధిపతులు స్పందించక తప్పలేదు.
విద్యార్థుల నుంచి ప్రశ్నలు ఎక్కువ కావడంతో..
విద్యార్థుల నుంచి ప్రశ్నల తాకిడి ఎక్కువ కావడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో ఫలితాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. మే 20 తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, గడిచిన సంవత్సరాలలో కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాల గురించి ముందస్తుగా ప్రకటన చేయలేదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఫలితాలు శుక్రవారం విడుదలవుతాయని వార్తలు ప్రసారం చేశాయి. అయితే అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో అధికారులు చేసిన ప్రకటనతో తేలిపోయింది. గత వార్షిక పరీక్షలకు సంబంధించి ఫలితాలు మే 12న ప్రకటించారు. 2022లో సీబీఎస్ఈ వార్షిక పరీక్షలను రెండు దశలలో నిర్వహించారు. అప్పుడు టర్మ్ -1 ఫలితాలను మార్చి 19న, టర్మ్ – 2 ఫలితాలను జూలై 22న వెల్లడించారు. ఇక 2019 లో నిర్వహించిన వార్షిక పరీక్షలకు సంబంధించి మే రెండో తేదీన ఫలితాలు ప్రకటించారు. 2018లో మే 26న, 2017లో మే 28న, 2016లో మే 21న, 2015లో మే 25న సీబీఎస్ఈ ఫలితాలను వెల్లడించారు.
మనదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యాసంస్థలు మొత్తం సీబీఎస్ఈ సిలబస్ ను అమలు చేస్తుంటాయి.. ఇందులో వార్షిక పరీక్షలు మిగతా రాష్ట్రాల పదవ తరగతి బోర్డుల కంటే ముందుగానే ముగుస్తాయి. తరగతులు కూడా మే చివరివారం లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి.. సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్రాల బోర్డుల సిలబస్ కంటే భిన్నంగా ఉంటుంది.. ఇందులో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు వివిధ రకాల పరీక్షలు ఉంటాయి. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు రాశారు. ఈ బోర్డు పరిధిలో చదివిన విద్యార్థుల్లో దక్షిణాది ప్రాంతం కంటే ఉత్తరాది ప్రాంతం వారే ఎక్కువగా ఉండటం విశేషం. ఫలితాలపై కొన్ని మీడియా సంస్థలు రకరకాల విశ్లేషణలు, వార్తలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో.. వాటిని నమ్మొద్దని సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ విభాగాధిపతులు విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.