Ambati Kirti Naidu: ప్రభుత్వ కొలువు అంటేనే కష్టతరమైన రోజులు ఇవి. కానీ ఆ యువతి ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. 2019 నుంచి ఇప్పటివరకు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఆమె ఔరా అనిపించింది. రాత్రి పగలు తేడా లేకుండా చదువుతూ, లక్షలు ఖర్చులు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేని ఈ రోజుల్లో.. ప్రభుత్వ ఉద్యోగాలతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. కానీ ఇప్పటికీ తన ఆశయం నెరవేరలేదని బాధపడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం కొత్త వీధికి చెందిన అంబటి కీర్తి నాయుడు అనే యువతి గత ఐదు సంవత్సరాల కాలంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. 2019లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారిగా ఉద్యోగం దక్కించుకున్నారు. అనంతరం కస్టమ్స్ విభాగంలో టాక్స్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించారు. గత ఏడాది మార్చిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ బెస్ట్ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్ ఉద్యోగం, భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్ విజిలెన్స్ విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికయ్యారు. ఇవి చాలా ఉన్నట్టు 2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే ఆరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ కొలువులు వచ్చాయి.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కావాలన్నది కీర్తి నాయుడు లక్ష్యం. అందుకు అహోరాత్రులు ఆమె శ్రమిస్తున్నారు. కానీ అనుకున్నది సాధించలేకపోయాను అన్న బెంగ ఆమెను వెంటాడుతోంది. నేరుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. 2019 నుంచి ఏడు ప్రభుత్వ కొలువులతో పాటు ఆరు ప్రైవేటు ఉన్నత ఉద్యోగాలు పొందినట్లు చెప్పుకొస్తున్నారు. కానీ తాను ఆశించినట్టు కొలువులు రావడంలేదని.. ఎప్పటికైనా వాటిని సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. కాగా వరుస కొలువులు సాధిస్తున్న కీర్తి నాయుడుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి.