Jagtial: పరీక్ష రాస్తే ఉద్యోగం పక్కా.. 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు!

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధిండమే గగనమవుతోంది. అలాంటిది ఎవరైనా రెండు ఉద్యోగాలు సాధిస్తే గొప్పగా చూస్తాం. ఇటీవల గురుకుల పరీక్షల్లో కొందరు మూడు నాలుగు కొలువులు సాధించారు.

Written By: Raj Shekar, Updated On : May 2, 2024 8:46 am

Jagtial

Follow us on

Jagtial: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్‌ సింగ్‌ను చూశారు. తర్వాత ఐదు సిక్సులు, నాలుగు సిక్సులు కొట్టిన క్రికెటర్లూ.. ఉన్నారు. అచ్చం క్రికెట్‌లో యువరాజ్‌సింగ్‌ తరహాలోనే ఓ యువకుడు ప్రభుత్వ కొలువులు కొట్టేస్తున్నాడు. పరీక్ష రాశాడంటే.. కొలువు కొట్టాల్సిందే అన్నట్లుగా ఈజీగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నాడు.

ఒక్క కొలువే కష్టమవుతున్న తరుణంలో..
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధిండమే గగనమవుతోంది. అలాంటిది ఎవరైనా రెండు ఉద్యోగాలు సాధిస్తే గొప్పగా చూస్తాం. ఇటీవల గురుకుల పరీక్షల్లో కొందరు మూడు నాలుగు కొలువులు సాధించారు. అయితే ఈ పరీక్షల ప్యాటర్న్‌ మొత్తం ఒకేలా ఉండడంతో ఇది సాధ్యమైంది. అయినా గొప్పే. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు వేర్వేరు ప్యాటర్న్‌ పరీక్షలు రాసి.. ఏకంగా ఆరు కొలువులు సాధించి రికార్డు సృష్టించాడు.

జగిత్యాల జిల్లా వాసి..
జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌కు చెందిన బెత్తపు సంజయ్‌ రెండేళ్లుగా పోటీ పరీక్షలకుప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో 2022లో రైల్వే ఉద్యోగం సాధించాడు. 2023లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం తెచ్చుకున్నాడు. తర్వాత ఇటీవల టౌన్‌ప్లానింగ్‌ అధికారి పోస్టు కొట్టేశాడు. గతేడాది గ్రూప్‌–4 పరీక్ష రాసి జాబ్‌ కన్ఫామ్‌ చేసుకున్నాడు. ఇక ఏఈఈ, ఏఈ పోస్టులకు పరీక్షలు రాసి వాటిని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం కానిస్టేబుల్‌ శిక్షణలో..
సంజయ్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ జాబ్‌ శిక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫలితాలు వస్తుండడంతో అన్నింటిని గమనిస్తూ వస్తున్నాడు. కానిస్టేబుల్‌ జాబ్‌ వదిలేసి ఏఈ పోస్టులో జాయిన్‌ అవుతానని తెలిపాడు.

యువతికి 5 ఉద్యోగాలు..
జగిత్యాల జిల్లాకే చెందిన ఓ యువతి కూడా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ల్యాగలమర్రి గ్రామానికి చెందిన మమతకు బీఈడీ, ఎంకామ్‌ పూర్తి చేసింది. డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయింది. గురుకుల నియామక పరీక్షలో కామర్స్‌ విభాగంలో డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్, సోషల్ విభాగంలో పీజీటీ, టీజీటీ జాబ్‌ సాధించింది. వీటితోపాటు గతేడాది టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన మున్సిపల్‌ విభాగంలోని జూరియన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికీ ఎంపికైంది.