
మారుతున్న కాలానికి అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పిల్లలను చదివించడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమయ్యే విద్యార్థుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతోంది. అబ్బాయిలతో పోలిస్తే చదువుకు దూరమవుతున్న వారిలో అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు ప్రయోజనం చేకూర్చేందుకు విప్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక ఇబ్బందులు, పేదరికం వల్ల ఉన్నత చదువులకు దూరమవుతున్న ఆడపిల్లలకు సంతూర్ స్కాలర్ షిప్ లను అందిస్తూ విద్యార్థినులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడంతో పాటు వాళ్ల ఉన్నత చదువుల కోసం ప్రోత్సహిస్తోంది. ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన విద్యార్థినుల కొరకు సంతూర్ నుంచి స్కాలర్ షిప్ ప్రకటన వెలువడింది. గడిచిన నాలుగేళ్ల నుంచి ప్రతి సంవత్సరం 900 మంది విద్యార్థినులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.
విప్రో కేర్స్, విప్రో కన్సూమర్ కేర్ ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు ప్రయోజనం చేకూర్చటం కోసం 2016 – 2017 సంవత్సరం నుంచి స్కాలర్ షిప్ లను అందిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. ఎవరైతే ఈ స్కాలర్ షిప్ కు అర్హులవుతారో వారికి ప్రతి నెలా 2,000 చొప్పున ఇంటర్ తర్వాత చదివే మూడు లేదా నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయ్యేంత వరకు నగదు జమవుతుంది.
ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లో పదో తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థినులు ఈ స్కీమ్ కు అర్హులు. విద్యార్థినులు 2019 – 2020 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయడంతో పాటు 2020 – 21 లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం చేరి ఉండాలి.
http://www.santoorscholarships.com/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలను నింపి ” విప్రో కేర్స్- సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు – 560035, కర్ణాటక” అనే అడ్రస్ కు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను పంపాలి. మెరిట్ ప్రాతిపదికన విద్యార్థినులను ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తారు.