https://oktelugu.com/

Sri Sitarama Kalyanam : భద్రాది రాముని కళ్యాణం.. గోటి తలంబ్రాలు సిద్ధం

Sri Sitarama Kalyanam : అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. ఇరముల మెరిసిన సీతారాముల కల్యాణము చూతము రారండి’ అంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 2, 2022 3:57 pm
    Follow us on

    Sri Sitarama Kalyanam : అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ‘జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. ఇరముల మెరిసిన సీతారాముల కల్యాణము చూతము రారండి’ అంటూ సీతా రాముల కల్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారో సినీ రచయిత వర్ణించారు. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులు పునీతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. స్వామి, అమ్మవారి నుదుటిపై జాలు వారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ఏటా పెరుగుతోంది. కరోనాతో రెండేళ్లు భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు 170 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేస్తున్నారు.

    -11 ఏళ్లుగా.. గోడిటో వలిచిన తలంబ్రాలే…
    భద్రాద్రి రాముల వారి కల్యాణానికి సర్వం సిద్ధ్దమైంది. శనివారం నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. కల్యాణంలో ప్రధాన ఘట్టంగా భావించే తలంబ్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటితో వలిచి సిద్ధం చేశారు. భక్తి శ్రద్ధలతో మూడు నెలలుగా ప్రత్యేకంగా ఈ ధాన్యాన్ని గోటితో వలిచి సిద్ధం చేస్తున్నారు. గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

    -తూర్పుగోదావరి జిల్లా నుంచి…
    ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ గోటి తలంబ్రాలను ఏటా తయారు చేస్తున్నారు. నాడు సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్యలతో పాటు, శబరి తమ గోటితో వలచిన తలంబ్రాలనే ఉపయోగించారన్న పురాణ కథనంతో ప్రేరణ పొందిన ఈ శ్రీకృష్ణచైతన్య సంఘం స్థాపకుడు కళ్యాణం అప్పారావు తానే ఈ బృహత్కార్యానికి 11 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టారు.

    -రామభక్తులను ఏకం చేసి..

    2012లో అప్పారావు రామభక్తులను ఏకం చేశారు. తన సొంత పొలంలో పండించిన వడ్లను వారికి ముందుగానే అందించి.. ఓ శుభ ముహూర్తాన తలంబ్రాలు వలవడం మొదలుపట్టారు. అప్పటి నుంచి ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అది కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. తలంబ్రాల పంట పండించి ఈ గోటి తలంబ్రాల విషయంలో అడుగడుగునా ప్రతి విషయంలోనూ ప్రత్యేక భక్తిశ్రద్ధలను తీసుకుంటారు. తలంబ్రాలకు ఉపయోగించే వరి నారు పోసే దగ్గరి నుంచి.. పంట కోత కోసేదాకా ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగానే భావించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహిస్తుంటారు.

    – మొదట నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం సీతారాముల మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో ఆంజనేయుడు, ఇతర వానరుల వేషధారణలోనే పొలం దున్ని, నారు పోసి.. మడిచేసి నాట్లు వేస్తారు.

    – అలా నాటిన వరి.. పెద్దదై.. పొట్ట దశకు వచ్చాక సీమంతం కూడా చేస్తారు. వరికోత సమంయలోనూ రాముడి వేషధారణలో ఉన్న భక్తునికి మొదట అందజేస్తారు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా.. రాముడి కల్యాణం నాడు తలంబ్రాలు ఇస్తున్నాం అనే కోణంలోనే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
    – సుమారు మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతో పండించిన పంటను.. శ్రీరామనవమి రెండు నెలల ముందు నుంచే.. చుట్టు పక్కల భక్తజనాన్ని పిలిచి వారిచేతో వలిపిస్తారు. దీంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు ఈ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ణంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమానికి వడ్లు వలుపు.. శ్రీరాముని పిలుపు అనే పేరుతో పిలుస్తారు.

    – అలా వలిచిన బియ్యాన్ని ప్రత్యేక కుండలో నింపి రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు కార్యక్రమం నిర్వహించి.. భద్రాచలం తీసుకొస్తారు. ఇలా తెచ్చిన తలంబ్రాలతో భద్రాద్రి ప్రదక్షిణ చేస్తారు.

    – తలంబ్రాలు తీసుకొస్తున్నాం రామయ్య అంటూ రామచిలుకతో సందేహం గోదావరి చెంతన జరగడం అదృష్టంగా భావిసాకతం అంటున్నారు నిర్వాహకులు. ఎన్నో ఏళ్లుగా భద్రాద్రి రామయ్యకు ఈ గోటి తలంబ్రాలను ఆలయంలో అప్పగిస్తున్నారు.. వీటినే శ్రీసీతారాముల కళ్యాణంలో వినియోగిస్తారు. ఇలా ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో ఏటా భక్తులు విరివిగా ముందుకొస్తున్నారు.

    – రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో జరిపే సీతారాముల కళ్యాణానికి సైతం ఈ గోటి తలంబ్రాలను పంపుతున్నారు కల్యాణం అప్పారావు. అందుకే కల్యాణోత్సవం అంటే గుర్తొచ్చేది గోటి తలంబ్రాలే.. ఈనెల 10న జరగనున్న శ్రీరామనవమికి పంపే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

    -తానీషా కాలం నుంచి ముత్యాల తలంబ్రాలు..
    భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతో పాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామయ్య సేవలో పాలుపంచుకోవాలనే తలంపుతో నిజాం నవాబు తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించేలా శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ ఆనవాయితీ ప్రకారం నేటికీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు.