MAA Elections: తెలుగు సినిమా పరిశ్రమ పరువును మీడియానో.. సోషల్ మీడియానో.. రాజకీయ నాయకులో తీయాల్సిన పనిలేదు. వాళ్ల పరువునే వాళ్లే తీసుకుంటున్నారు. ఎంచక్కా బురద జల్లుకుంటున్నారు.. ‘మా’ ఎన్నికల పుణ్యమా అని ఇండస్ట్రీ లొసుగులన్నీ కూడా బయటపడుతున్నాయి.. తెలుగు ప్రముఖులు ఒకరి సీక్రెట్స్ మరొకరు.., ఇండస్ట్రీలో జరిగిన అవమానాలను బయటపెట్టుకుంటూ పరువు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను మించి ‘మా’ ఎన్నికలు రక్తికడుతున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు తెరపైనే కాదు.. తెర బయట కూడా ఇంత రక్తికట్టిస్తారన్నది తెలియక ‘‘ఫాఫం జనాలు’’ ఈ ఎపిసోడ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల కేంద్రంగా జరుగుతున్న రచ్చపై స్పెషల్ ఫోకస్..
-ప్రకాష్ రాజ్ అంటించాడు..
‘మా’ ఎన్నికలు ఇంత రసవత్తరంగా మారడానికి కారణం ప్రకాష్ రాజ్. అతడు ఎంట్రీ ఇచ్చి ‘మా’ ఎన్నికల్లో నిలబడడమే వివాదాస్పదమైంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని.. కర్ణాటక వాసి అని మొదట్లో వివాదం చేశారు. అయితే నాగబాబు సపోర్టుతో మెగా ఫ్యామిలీ ఆయన వెంటే ఉందని అంతా నమ్మారు. ఇక మెగా ఫ్యామిలీకి దగ్గరైన హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ సహా ప్రకాష్ రాజ్ ను వ్యతిరేకించిన జీవిత, హేమ, సీవీఎల్ లాంటి వారంతా ఆయన వెంటే నడిచారు. ప్రకాష్ రాజ్ వారిని కలిసి మద్దతు కూడగట్టడంలో విజయం సాధించాడు.
-మంచు విష్ణు రంగంలోకి.. కంపు చేసిన నరేశ్
ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని మొదలుపెట్టిన మంచు విష్ణు వర్గానికి పాత అధ్యక్షుడు నటుడు నరేశ్ తోడై అగ్నికి ఆజ్యం పోశాడు. ప్రకాష్ రాజ్ వర్గాన్ని దెబ్బతీసేలా విందులు, వినోదాలు ప్లాన్ చేసి కలవరపెట్టాడు. దీనికి ప్రతిగా ప్రకాష్ రాజ్ కూడా ప్లాన్ చేసినా వారి ప్రయత్నాలకు ఎక్కడో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రకాష్ రాజ్ కు, విష్ణుకు మధ్యలో నరేశ్ ఎంట్రీ ఇచ్చి ఈ ఎన్నికలను మంచి కంపు చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
-ఎత్తులు పైఎత్తులు..
ప్రకాష్ రాజ్ తెలివిగా తనను వ్యతిరేకించిన వారిని స్వయంగా కలుస్తూ వారికి దగ్గరైన సినీ దిగ్గజ ప్రముఖులతో చెప్పిస్తూ తన వైపు తిప్పుకున్నారు. ఈ కోవలో బండ్ల గణేష్, జీవిత, సీవీఎల్ లాంటి వారు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచి ఆయన వర్గంలో నిలిచారు. ఇక మంచు విష్ణు ఏకంగా నందమూరి, సూపర్ స్టార్ కృష్ణల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. బాలక్రిష్ణను, కృష్ణను కలిసి వారి సానుభూతి పరులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాడు. ఇలా మంచు విష్ణు తెరవెనుక మంత్రాంగం.. ప్రకాష్ రాజ్ కలుపుకుపోయే తత్వంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మాటల మంటలు అంటుకున్నాయి.
-మీడియాకు ఎక్కి రచ్చ
‘రిపబ్లిక్ వేడుక’లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలింది. మోహన్ బాబును లాగి పవన్ విమర్శించడంతో గొడవ మొదలైంది. పవన్ కు వ్యతిరేకంగా మంచు విష్ణు రాజకీయం చేశాడు. సినీ ఇండస్ట్రీకి పవన్ కు సంబంధం లేదన్నాడు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ను స్పందించాలని.. నీ మద్దతు ఇండస్ట్రీకా? పవన్ కా? అంటూ ఇరుకునపెట్టాడు. దీనికి ప్రకాష్ రాజ్ సైతం ఘాటుగా స్పందించాడు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయాలను, రాజకీయ నాయకులను లాగడం తప్పు అంటూ కవర్ చేశాడు. కేసీఆర్, జగన్ , పవన్ లకు ఏం సంబంధం అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇక మా ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రకాష్ రాజ్ పలు ప్రముఖ న్యూస్ చానెల్స్ కు వెళ్లి డిబేట్లు పెట్టి మంచు విష్ణు వర్గంపై విమర్శలు చేయడం కాకరేపింది. ‘పవన్ కళ్యాణ్ ఫస్ట్ షో కలెక్షన్లు అంత కాదు నీ సినిమా బడ్జెట్’ అంటూ మంచు విష్ణు స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రకాష్ మాట్లాడాడు. దీంతో మెగా ఫ్యామిలీ సపోర్టు తనకే ఉందని వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రకాష్ తన విమర్శల్లో మోహన్ బాబును లాగారు.
ప్రకాష్ రాజ్ విమర్శలతో విష్ణు బయటకు వచ్చి తాజాగా ప్రకాష్ రాజ్ పరువు తీసేలా వ్యాఖ్యానించారు. ‘ఒకప్పుడు మా నాన్న మోహన్ బాబు కాళ్లు ప్రకాష్ రాజ్ పట్టుకున్నాడని.. చనిపోయిన నటుడు శ్రీహరి సాక్షి’ అంటూ ఆయన పరువు తీసే వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ను మా ఫ్యామిలీని లాగవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
– చిచ్చు పెట్టిన పోస్టల్ బ్యాలెట్
ఎన్నికలు దగ్గర పడడంతో మంచు విష్ణు ఎత్తులు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారందరి పోస్టల్ బ్యాలెట్ డబ్బులు రూ.28వేల వరకు చెల్లించాడు. వారి ఓట్లకు గాలం వేశాడు. అయితే దీన్ని ప్రకాష్ రాజ్ వ్యతిరేకించడం.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి విష్ణు అనైతిక చర్యలపై మండిపడ్డారు. విష్ణు దొడ్డిదారిన గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించాడు.
ఇక ప్రకాష్ రాజ్ ఆరోపణలు మంచు విష్ణు తిప్పి కొట్టారు. ప్రకాష్ రాజ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడని.. రియల్ లైఫ్ లోనూ బాగా నటిస్తున్నాడని.. ఆయన పరువు తీసేలా తీవ్ర విమర్శలు చేశారు. నటులు జీవిత, శ్రీకాంత్ పైనా విష్ణు మండిపడ్డారు. జీవిత సినీ నిర్మాతను కలిసి ఫ్లాప్ అవుతుందని డబ్బు తీసుకుందని విష్ణు సంచలన విషయాన్ని బయటపెట్టి విమర్శించాడు. శ్రీకాంత్ , బెనర్జీ, హేమలపై కూడా కామెంట్ చేశాడు.
-పరువు తీసుకుంటున్న సినీ ప్రముఖులు
ఇలా ‘మా’ ఎన్నికలు అక్టోబర్ 10న జరుగబోతుండగా.. అంతకుముందే ఎన్నికలు మించిన విమర్శలు, ప్రతి విమర్శలతో ఇండస్ట్రీ ప్రముఖులు లొసుగులన్నీ బయటపెట్టుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరు సీక్రెట్ విషయాలను బయటపెట్టి పరువుతీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిశాక గెలిచేది ఒకరే. కానీ తర్వాత పోయేది ఇద్దరి పరువు అన్న ఇంగితం లేకుండా చెరో గ్రూపు పరువు తీసుకుంటున్న వైనం చూసి సినీ పెద్దలే తలపట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంత గలీజు రాజకీయాలు.. అసలైన రాజకీయాల్లోనూ లేవన్న టాక్ వినిపిస్తుందంటే ఎంత రచ్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.